Diamond Jubilee celebrations: విద్యా బుద్దులకు నెలవైన ఈ పాఠశాల గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ ప్రోలయ వేమన జెడ్పీ ఉన్నత పాఠశాల. 75 వసంతాల ఘనమైన చరిత్ర కలిగిన ఈ పాఠశాల ఎంతో మంది ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచింది. పెదకాకాని మండలంలో అప్పట్లో సరైన విద్యా సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు గుంటూరు లేదా మంగళగిరి వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఆలోచించారు ఆ గ్రామ ప్రజలు. తమ గ్రామంలోనే పిల్లలకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో పాఠశాల ఏర్పాటుకు నడుం బిగించారు. జొన్నల పిచ్చిరెడ్డి అనే రైతు ఐదెకరాల భూమి ఇచ్చి పాఠశాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. అలా గ్రామ ప్రజలంతా కలిసి విరాళాలు సమకూర్చి పాఠశాలను మెుదలెట్టారు.
ప్రోలయ వేమన పేరుతో నామకరణం..: 1946 సెప్టెంబర్ 10వ తేదిన ప్రారంభమైంది ఈ పాఠశాల. భవన నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన ప్రోలయ వేమన పేరుని పాఠశాలకు నామకరణం చేశారు. ఇలా స్థానికుల తోడ్పాటు, ప్రభుత్వ సహకారంతో పాఠశాల దినదిన అభివృద్ధి చెందింది. 1997లో 50 సంవత్సరాలు వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకుంది. దీంతో పూర్వవిద్యార్థులంతా కలిసి ఒక కమిటీగా ఏర్పడి వజ్రోత్సవ సంబరాలు చేస్తున్నారు.
ప్రస్తుతం 600మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. నాడునేడు కింద వచ్చిన నిధులతో అదనపు తరగతి గదులు నిర్మించినా... విద్యార్థుల సంఖ్య పెరిగిన దృష్ట్యా మరిన్ని గదులు నిర్మించాల్సినా అవసరం ఉంది. దీంతో ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు రాజకీయ. వ్యాపార రంగాల్లో ఆర్థికంగా ఉన్నత స్థానాలలో ఉండడంతో... పాఠశాలకు అవసరమైన ఆడిటోరియం, డైనింగ్ హాల్ నిర్మాణం కోసం ముందుకు వచ్చారు.-సుధ, ప్రధానోపాధ్యాయురాలు
అదృష్టంగా భావిస్తున్నాం..: తాము చదువుకున్న బడి అభివృద్ధికి చేయూత అందించడం అదృష్టంగా భావిస్తున్నట్టు పూర్వవిద్యార్థులు చెబుతున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందోత్సాహంలో తేలిపోతున్నామని అన్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఇక్కడ చదివి వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో స్థిరపడిన ప్రముఖులను ఈ వజ్రోత్సవ వేడుకలలో సన్మానించనున్నారు.
ఇదీ చదవండి: ఇంటిబాట పట్టిన వందలాది మంది విద్యార్థులు.. ఆరా తీసిన పోలీసులు ఏం చేశారంటే..?