ఓ వైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరో వైపు భక్తుల శివనామ స్మరణ నడుమ పంచారామ క్షేత్రమైన గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వరాలయం దేదీప్యమానంగా వెలుగొందింది. కార్తిక పౌర్ణమి కావడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పరమ శివుని కటాక్షాన్ని పొందేందుకు.. భక్తులు క్షేత్రానికి పోటెత్తారు. వేకువజాము నుంచే కృష్ణానదిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు. నది ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్ల కింద మహిళలు కార్తిక దీపాలను వెలిగించి.. అమరేశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. రుత్వికులు లక్ష బిల్వార్చన, విశేష అభిషేకాలు జరిపారు.
కార్తిక మాసం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. అందునా నేడు పౌర్ణమి సోమవారం కావటంతో గుంటూరు జిల్లాలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి బాపట్ల సూర్యలంక తీరానికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించి.. తీరం వెంబడి నైతిక లింగాలను ఏర్పాటు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు.
కార్తిక పౌర్ణమి, సోమవారాన్ని పురస్కరించుకొని మాచర్లలోని పలు ఆలయాలు శోభాయమానంగా మారాయి. శైవ ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి. రామప్ప దేవాలయం, ఇష్ట కామేశ్వర స్వామి ఆలయాల్లో దీపోత్సవం, జ్వాల తోరణం ఘనంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తిక మాసం మూడో సోమవారం పురస్కరించుకుని కాకుమాను మండలం కొమ్మూరు ఆగస్తేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. మహిళలు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు తరలివచ్చి దీపారాధనలు చేశారు. భక్తుల రాకతో ఆలయం ఆవరణ సందడిగా మారింది.
ఇదీ చదవండి: రేపే బల్దియా పోలింగ్.. తుది అంకానికి ఏర్పాట్లు