YCP Internal Fight: గుంటూరు జిల్లా తాడికొండ వైకాపాలో వర్గపోరు ముదురుతోంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు ఇటీవల సమావేశాలు నిర్వహించారు. అయితే.. అప్పటి నుంచి తాము సూచించిన పనులు జరగకుండా ఎమ్మెల్యే శ్రీదేవి అధికారులపై ఒత్తిడి తెచ్చారని వ్యతిరేక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. మండల పరిషత్ సమావేశాల్లో చేసిన తీర్మానాలు కూడా అమలు చేయనీయకుండా ఎంపీడీవోపై ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతలు ఇవాళ తాడికొండ ఎంపీడీవో అనురాధను కలిసి నిలదీశారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయకపోవటంపై ప్రశ్నించారు. అన్నింటికి ఎమ్మెల్యే చెబితేనే చేస్తామంటే సర్పంచులు, ఎంపీటీసీలుగా తామెందుకని నిలదీశారు. తమ అధికారాలకు అడ్డుపడితే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్ఛరించారు. అనంతరం తాడికొండ తహసీల్దార్ చంద్రారెడ్డిని కలిసి.. పాములపాడు గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలకు మట్టి తరలింపుని ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. పంచాయతీ తీర్మానం ఉన్నా.. ఇలా ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ప్రజాప్రతినిధులు తన వద్దకు రావట్లేదనే కక్షతో ఎమ్మెల్యే శ్రీదేవి అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.
ఇదీ చదవండి : ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం రసాభాస.. కౌన్సిలర్ల తోపులాట