రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ గుంటూరులో తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. శాప్ పూర్వ అధ్యక్షులు పీఆర్ మోహన్ ఆధ్వర్యంలో.. బృందావన్ గార్డెన్స్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయం ముందు నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ దాడులను అరికట్టడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆలయాలను రక్షించుకునేందుకు భక్తులే ముందుకు వస్తారన్నారు. బాధ్యులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నెల్లూరులో గాంధీబొమ్మ సెంటర్ వద్ద తెలుగు యువత నేతలు ఆందోళన చేపట్టారు. మహాత్మా రాష్ట్రాన్ని కాపాడు అంటూ గాంధీ విగ్రహం ఎదుట ప్రమిదలు వెలిగించి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన వెనుక వైకాపా నేతల హస్తముందని ఆరోపిస్తూ.. చేసిన తప్పు బయటపడుతుందనే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆలయాలపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ తీరు మారకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న విజయసాయి రెడ్డి.. చంద్రబాబుకు సవాల్ విసరడం హాస్యాస్పదమన్నారు.
ఇదీ చదవండి: