రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గుంటూరు జిల్లాలో పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత వాహనాలను రోడ్లపైకి రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారిని గుర్తింపు కార్డులు, పాస్‌లు ఉంటేనే అనుమతిస్తున్నారు. జిల్లాలో 109 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వాటిలో గుంటూరు నగరంలోనే 68 ఉన్నాయి. కేసుల ఉద్ధృతితో నగరంలో ప్రతి అర కిలోమీటరుకు ఓ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. లాక్డౌన్ విషయంలో మొదట్లో కొంత ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగానే.. కేసులు విపరీతంగా పెరిగాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రజలు బయటకు రాకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
సరి సంఖ్య తేదీల్లోనే బయటకు..
నిత్యావసరాల కోసం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు సూచించారు. సమీప ప్రాంతాల్లోనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇవాళ్టి నుంచి నిత్యావసరాల కొనుగోలుకు సరి-బేసి విధానం అమలు చేస్తున్నారు. సరి సంఖ్య తేదీల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కొనుగోళ్లకు అనుమతిస్తారు. బేసి సంఖ్య తేదీల్లో రోజంతా పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కరోనాను కట్టడి చేయాలంటే కొద్దిరోజులు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: