Electric Meters to Agriculture Pumpsets: వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చే విధానాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ అమరికపై ఇప్పుడు మిగిలిన జిల్లాలపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఓ గ్రామంలో పంపుసెట్లకు మీటర్లు బిగిస్తోంది. ప్రభుత్వ తీరుపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో.. ప్రయోగత్మకంగా పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చుతున్నారు. ఈ గ్రామంలో జొన్న, మొక్కజొన్న, నిమ్మ, అరటి వంటి పంటలు పండిస్తుంటారు. వీటికి తడుల వారీగా నీరు అందించాల్సి ఉంటుంది. గ్రామంలో మొత్తం 265 వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు 4 రోజుల నుంచి పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అమరుస్తున్నారు. ప్రస్తుతానికి 90 మీటర్లు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంవిద్యుత్ మీటర్‌పై రైతులకు అవగాహన కల్పించి.. వారి అనుమతితోనే ఏర్పాటుచేస్తున్నట్లు చెబుతున్నారు. విద్యుత్ మీటర్ల ఏర్పాటు రైతులకు నష్టం చేస్తుందని రైతుసంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : అమ్మవారే ఇంటింటికీ వెళ్తారు.. ఇదే అక్కడి ప్రత్యేకత..!
" వ్యవసాయ పంపుసెట్లకు వైఎస్సార్ రైతుకు ఉచిత విద్యుత్ పథకం పేరుతో విద్యుత్ మీటర్లను అమర్చుతున్నారు.ఒకసారి విద్యుత్ మీటర్ బిగించడమంటూ జరిగితే దానికి బిల్లులు వస్తాయి. బిల్లులతో రైతు మీద ఆర్థిక భారం పడుతుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాగే గ్యాస్ సబ్సిడీ అంటూ ఖాతాల్లో మొదట్లో మొత్తాన్ని వేసింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి.? అదే విధంగా రేపు రాష్ట్రంలో కూడా ఈ విద్యుత్ మీటర్ల విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురవుతుందని రైతాంగం ఆందోళన చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం కూడా ఉందని ఆందోళన చెందుతున్నాం." -శివసాంబిరెడ్డి, ఉపాధ్యక్షుడు ,గుంటూరు జిల్లా రైతు సంఘం.
"వ్యవసాయ పంపుసెట్లను రైతులందరూ వ్యతిరేకించమని...రైతులెవరూ కూడా విద్యుత్ శాఖ వారికి సహకరించవద్దని రైతు సంఘం తరుపున కోరుతున్నాను. " -శ్రీమన్నారాయణ, నాయకుడు, చుండూరు మండల రైతు సంఘం
ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందని చెప్పడం కంటే... మీటర్లు బిగించకపోవడమే మంచిదని రైతు సంఘాలు అంటున్నాయి.
ఇదీ చదవండి : సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించే "వారియర్స్"