గుంటూరు జిల్లాలో ...
గుంటూరు జిల్లా కోర్టులో పనిచేసే టైపిస్టులకు, గుమాస్తాలకు భారతీయత స్వచ్చంధ సేవా సంస్థ అధ్యక్షుడు చిగురుపాటి రవీంద్ర నిత్యావసర సరకుల పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో...
కరోనా కారణంగా ఉపాధి లేక అవస్థలు పడుతున్న ఆర్కెస్ట్రా కళాకారులకు విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన మూవింగ్ మైండ్స్ ఆర్థిక సహాయంతో సీపీఎం ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది కళాకారులకు ఈ సరకుల కిట్లను అందించారు.
విశాఖ నుంచి జాతీయ రహదారిపై ఇతర ప్రాంతాలకు నడిచి వెళ్లే వలస కూలీలకు ఆర్ఎస్ఎస్, సాక్షర భారత్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. వలస కూలీలకు తమవంతు సాయంగా భోజనం పంపిణీ చేసినట్లు సభ్యులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై నడచి, వాహనాలలో వెళ్లే వలస కూలీలకు స్థానిక బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆహారం అందిస్తున్నారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది స్వయంగా ఆహారం తయారు చేసి ప్యాకెట్లను వలస కూలీలకు అందించారు. ఈరోజు 500 మందికి ఆహారం పంపిణీ చేశారు.
కర్నూలు జిల్లాలో...
కర్నూలులో కొంత మంది దాతలు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. నగరంలోని ఎ.క్యాంప్ కాలనీలో 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, కంది బేడలు, నూనె, చక్కెర, మామిడి పండ్లు అందించారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన వస్త్ర దుకాణాల సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేశారు. జాతీయ రహదారిపై వెళ్లే వలసకూలీలకు, పేదలకు ఆహార పొట్లాలను అందించారు. రావులపాలెం సీఐ వి.కృష్ణ, ఎస్సై బుజ్జిబాబు, సిఆర్సి సేవా సంస్థ కార్యదర్శి అశోక్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొని భోజన పొట్లాలను పంపిణీ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో...
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం పదమూడో వార్డులో జనసేన నాయకులు పేదలకు కూరగాయలు, ముస్లింలకు రంజాన్ తోఫా, కూరగాయలు పంపిణీ చేశారు.
జంగారెడ్డిగూడెం డాంగేనగర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని జనసేన నాయకులు తెలిపారు. తమవంతు బాధ్యతగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను గుర్తించి సరకులు పంపిణి చేసినట్లు తెలిపారు.
సింగవరం కూడలిలో కొవ్వలి గ్రామానికి చెందిన వెలమాటి అశోక చక్రధరరావు వలసకూలీలకు భోజనం సమకూర్చారు. ఆశ్రం కూడలిలో అక్షయ పాత్ర, ఎంఎల్ఎసి మెమోరియల్ ట్రస్ట్ వారు వలస కూలీలకు ఆహారం పొట్లాలు అందజేశారు. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, పోలిశెట్టి మెమోరియల్ ట్రస్టు, ఐద్వా ఆధ్వర్యంలో వలస కూలీలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సత్యనారాయణపురం వద్ద కోటగిరి శ్రీను, భీమాల దశరధరామయ్య వలస కూలీలకు భోజనం పొట్లాలను అందజేశారు.