అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తోపాటు మరో అయిదుగురు ప్రయాణించగా.. వారిలో తెలుగు మహిళ 34ఏళ్ల బండ్ల శిరీష కూడా ఉన్నారు. దీంతో ఆమె స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలిలో శిరిష కుటుంబసభ్యులు.. హర్షం వ్యక్తంచేశారు. శిరీష అంతరిక్షంలోకి కాలు పెట్టిన మొట్టమొదటి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యాత్రను మొదటి నుంచి వీక్షించిన కుటుంబసభ్యులు.. విజయవంతంగా భూమికి చేరుకున్నాక మిఠాయిలు తినిపించుకున్నారు. శిరీష తన చిన్ననాటి కలను సాకారం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ మురిసిపోయారు.
శిరీషకు చిన్ననాటి నుంచే ధైర్యం ఎక్కువన్న బంధువులు.. ప్రతి పనిలోనూ చురుగ్గా ఉండేదన్నారు. అంతరిక్షయానానికి ముందు కూడా తమకు ఫోన్‌చేసి ఆందోళన చెందవద్దని చెప్పిందని చెబుతున్నారు. శిరీష సాధించిన విజయం అపురూపమైందన్న కుటుంబసభ్యులు, బంధువులు.....ఆమె మరెందరికో స్ఫూర్తిగా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: