గ్రామ పంచాయతీలు, సచివాలయాలు వేర్వేరని ... సచివాలయాలతో పంచాయతీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం ఒక వైపు చెబుతూ.. మరో వైపు గ్రామ సచివాలయాలకు సరఫరా చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లకు బిల్లులను పంచాయతీ సాధారణ నిధుల నుంచి చెల్లించాలని ఆదేశాలివ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద ప్రభుత్వం మళ్లించడం, పన్నుల వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్నందున పంచాయతీలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఈ దశలో సచివాలయాల్లో వినియోగిస్తున్న కంప్యూటర్లు, ప్రింటర్ల బిల్లు మొత్తాలు.. వాటి సరఫరాదారుకు చెల్లించాలని పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) తాజాగా పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులు పంపారు. దీని ఆధారంగా మిగిలిన జిల్లాల్లోనూ డీపీవోలు ఆదేశాలిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు సర్పంచులు, కార్యదర్శుల్లో కలకలం రేపుతున్నాయి.
గ్రామ సచివాలయాలకు రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్ చొప్పున 2019లో సమకూర్చారు. వీటి సరఫరాదారులకు సకాలంలో చెల్లించని కారణంగా పలువురు హైకోర్టుని ఆశ్రయించారు. బిల్లులు వెంటనే చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంప్యూటర్‌కు రూ.38,965, స్కానర్‌కు రూ.10,943 చొప్పున వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని పశ్చిమ గోదావరి డీపీవో జారీ చేసిన ఉత్తర్వుల్లో గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ 2019 సెప్టెంబరు 9న జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ... గ్రామ పంచాయతీలే బిల్లులు చెల్లించాలని డీపీవో పేర్కొన్నారు. సచివాలయాలకు సరఫరా చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లకు బిల్లులు చెల్లించాలన్న డీపీవో ఆదేశాలు అమలైతే ... పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీలపై రూ.4.68 కోట్లకుపైగా ఆర్థిక భారం పడనుంది.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీల సంతకాలు సేకరణ: వైకాపా