CM Jagan davos Tour: కాలుష్యం లేని ఇంధనం, పారిశ్రామిక ప్రగతి వైపు అడుగులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని సీఎం జగన్ తెలిపారు. ఉత్పాదక రంగంలో ఆధునికత సంతరించుకోడానికి వీలుగా అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి డబ్ల్యూఈఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు దోహదం చేస్తాయన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం-డబ్ల్యూఈఎఫ్)లో మొదటి రోజు ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు.. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
చర్చలు.. ఒప్పందాలు : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్‌నకు సీఎం వివరించారు. ఓడరేవులు, విమానాశ్రయాల ఆధారిత పారిశ్రామికీకరణపై ఆయనతో చర్చించారు. ‘పరిశ్రమలకు అవసరమైన మానవవనరులు, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. కొవిడ్ అనంతరం దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకున్నాం’ అని వివరించారు. సామాజిక పాలన, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్ వేదిక ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలనా సంస్కరణల గురించి వివరించారు. అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
- బయోటెక్నాలజీ, వైద్యరంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై కలిసి పనిచేసే విషయమై డబ్ల్యూఈఎఫ్ ఆరోగ్యం-వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్‌తో చర్చించారు. రాష్ట్రంలో వైద్యరంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి సీఎం వివరించారు. కొత్త బోధనాసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
- రవాణా రంగంలో వస్తున్న మార్పులపై డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టెయినబులిటీ విభాగాధిపతి ఫెడ్రో గోమెజ్‌తో చర్చించారు. కాలుష్యం లేని రవాణా వ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను కాలుష్యం లేకుండా పారవేయాల్సిన (డిస్పోజల్) అవసరం ఉందన్నారు. భూమి, నీటి వనరులు కాలుష్యం కాకుండా పవన, సౌర, జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను సమీకృతపరిచే ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టినట్లు తెలిపారు. ఈ రంగంలో సహకారానికి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల నాణ్యమైన మానవవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త పంపిణీ వ్యవస్థలు, డేటా పంపిణీ, ఉత్పత్తులకు విలువ జోడింపు వంటి ఆరు అంశాల్లో డబ్ల్యూఈఎఫ్ నుంచి రాష్ట్రానికి సహకారం అందుతుంది.
- రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యల గురించి బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్‌పాల్ బక్నర్‌తో జరిగిన సమావేశంలో సీఎం చర్చించారు. పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా సింగిల్ డెస్కు విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నామని వివరించారు. అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతం అదానీతో సమావేశమై రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఇవీ చూడండి
Pattabhi: వారితో మాట్లాడేందుకే జగన్ లండన్ వెళ్లారు: పట్టాభి