MP Vijayasai Reddy: విశాఖలో అక్రమాస్తులు కూడగట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. మంగళవారం విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కూర్మన్నపాలెంలో భూయజమానికి ఒక శాతం ఇచ్చి, ప్రాజెక్టు డెవలపర్ 99 శాతం తీసుకున్నారని.. ప్రపంచంలో ఎక్కడాలేనిది ఇక్కడే చూస్తున్నానని అనడం తీవ్ర చర్చనీయాంశమైంది. హయగ్రీవ ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. విశాఖలో స్థిరాస్తి దందా తీరుకు, అక్రమాలకు అద్దంపట్టాయి. దసపల్లా భూముల వ్యవహారంలో భూయజమానులుగా చలామణిలో ఉన్నవారికి 29 శాతం ఇచ్చి, డెవలపర్ 71 శాతం తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడమే పెద్ద సంచలనమైతే.. ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టిన కూర్మన్నపాలెం ప్రాజెక్టు వ్యవహారం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.
కూర్మన్నపాలెం ప్రాజెక్టు స్థానిక వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణదే. హయగ్రీవ ప్రాజెక్టులోనూ ఆయన భాగస్వామి. కూర్మన్నపాలెం ప్రాజెక్టు గురించి విజయసాయిరెడ్డి తనంతట తానే ప్రస్తావించడం రాజకీయంగానూ దుమారం సృష్టిస్తోంది. దసపల్లా భూములకు సంబంధించి 71 శాతం డెవలపర్ తీసుకుని, భూయజమానులకు 29 శాతం ఇవ్వడమేంటన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా.. కూర్మన్నపాలెంలో డెవలపర్ 99 శాతం తీసుకుని, భూయజమానికి ఒక శాతం ఇస్తుంటే ఎందుకు అడగడం లేదని ఎదురు ప్రశ్నించారు. దాన్ని చర్చనీయాంశం చేయడం ద్వారా.. దసపల్లా వ్యవహారం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు.
వైకాపా నాయకుల మధ్య ఉన్న విభేదాలు, ఆధిపత్యపోరుకు.. సాయిరెడ్డి వ్యాఖ్యలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తన గురించి పార్టీలోని వ్యక్తులే మీడియాకు సమాచారం ఇస్తున్నట్లు కొందరు చెప్పారని, ఆధారాలుంటే వారిపై పార్టీపరంగా చర్య తీసుకుంటామని చెప్పడం.. పార్టీలో లుకలుకల్ని బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది. విశాఖకు ఇప్పటికీ తానే ఎంపీనని, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుంటానని అనడం ద్వారా.. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా తప్పించినా విశాఖపై తన పట్టు కొనసాగుతోందని చెప్పేందుకు సాయిరెడ్డి ప్రయత్నించారన్న అభిప్రాయం వైకాపా వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల్లో ఓ భారీ బహుళ అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. 2019లో పనులు ప్రారంభించారు. మొత్తం 15 లక్షల చదరపు అడుగుల భవనాలు నిర్మించేలా, అందులో కేవలం 14 వేల 400 చదరవు అడుగులు భూయజమానులకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అంటే డెవలపర్‌కు 99.04 శాతం వాటా ఇస్తే, భూయజమానులకు 0.96 శాతం మాత్రమే వస్తుంది. 2008లో Y.S.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఎండాడలో ఎకరా 45 లక్షల చొప్పున 12.51 ఎకరాలను హయగ్రీవ డెవలపర్స్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఈ సంస్థ యజమాని జగదీశ్వరుడు. వివిధ అనుమతులు రావడంలో జాప్యంతో ప్రాజెక్టు ఆలస్యమైంది.
2020లో హయగ్రీవ సంస్థతో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జి.వెంకటేశ్వరరావు.. విల్లాల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో కోర్టుకు వెళ్లారు. కొంతకాలానికి జగదీశ్వరుడు, ఎంవీవీ, జి.వెంకటేశ్వరరావు మధ్య సయోధ్య కుదరడంతో... కేసులు ఉపసంహరించుకుని పనులు ప్రారంభించారు. తాజాగా ప్లాన్ మంజూరుకు జీవీఎంసీ సిద్ధమైంది. అయితే.. గడువులోగా ప్రాజెక్టు చేపట్టనందున హయగ్రీవ భూముల్ని వెనక్కి తీసుకుంటారా అని విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన విలేకరులు .. ప్లాన్‌కు అనుమతులు రాకుండానే పనులు చేస్తున్నారని గుర్తుచేశారు. తనను ఇబ్బంది పెట్టాలనే ఈ ప్రశ్న అడిగారని తెలుసుంటూనే.. మా పార్టీ వాళ్లను మేం కాపాడుకోవాలి కదా అని విజయసాయి వ్యాఖ్యానించారు. అంటే.. హయగ్రీవ ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లయింది.
విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడిన తీరు.. ఆయనలో ఆద్యంతం తీవ్ర ఆందోళన, నిస్పృహ, అసహనం, ఆత్మరక్షణ వైఖరి కనిపించాయి. రాజధాని అమరావతి నిర్మాణంతో లబ్ధి పొందేది కేవలం ఒక ప్రధాన సామాజికవర్గం మాత్రమేనని మిగతా నాయకులతోపాటు పదేపదే విషం చిమ్మే సాయిరెడ్డి.. వైకాపా ప్రభుత్వం పాలనా రాజధానిగా చేస్తామని చెబుతున్న విశాఖలోనూ 70 శాతం భూములు అదే సామాజికవర్గం చేతుల్లో ఉన్నాయని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. దసపల్లా భూముల యజమానులుగా చలామణి అవుతున్న 64 మందిలోనూ 55 మంది అదే సామాజికవర్గానికి చెందినవారేనని.. వారికి తాము న్యాయం చేస్తున్నామని చెప్పారు.
అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన 29 వేల మంది సన్నకారు, చిన్నకారు రైతులపై యుద్ధం ప్రకటించి.. విశాఖలో 55 మంది ధనికులకు మేలు చేస్తున్నామని చెప్పడం విరుద్ధం కాదా అనే ప్రశ్నకు విజయసాయి నుంచి సమాధానం లేదు. విశాఖలో తనకు మూడు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్ మాత్రమే ఉందన్న సాయిరెడ్డి.. దసపల్లా భూముల వ్యవహారంలో మాత్రం లోతుల్లోకి వెళ్లలేదు. కుమార్తె, అల్లుడు భూమలు కొనడాన్ని తనకు ఎలా ఆపాదిస్తారంటూ ఎదురుదాడికి దిగారు. దసపల్లా భూముల డెవలపర్లుగా ఉన్న వ్యక్తులతో అనుబంధం గురించి గానీ, ఆ కంపెనీలోకి తన కుమార్తె, అల్లుడి కంపెనీ నుంచి నిధులు వెళ్లినట్లు విపక్షాలు చేస్తున్న ఆరోపణల గురించి గానీ ప్రస్తావించలేదు.
ఇవీ చదవండి: