వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలకు ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాలకు చెందిన పేద మహిళలకు రూ.18,750 చొప్పున సాయం అందించింది. రెండో ఏడాది నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నిధులు విడుదల చేశారు. 23 లక్షల 14 వేల 342 మంది మహిళలకు 4 వేల 339.39 కోట్ల సాయం అందించారు. నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కోటి జనాభాకు మంచి..
వైఎస్ఆర్ చేయూత కింద నాలుగేళ్లలో మొత్తం 75 వేల సాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కోటి జనాభాకు మంచి జరిగే గొప్ప కార్యక్రమం అని వ్యాఖ్యానించారు. 45-60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూర్చుతున్నామని వివరించారు. 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లపాటు 75 వేలు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామన్నారు. మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుందని ఈ పథకాన్ని చేపట్టామని జగన్ వివరించారు. 6 లక్షలకుపైగా ఉన్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నామన్న సీఎం.. వీరందరికీ సామాజిక పెన్షన్ల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నా.. చేయూత అందిస్తున్నామన్నారు.
వ్యాపారాలకు సాయం..
చేయూత కింద లబ్ధిపొందిన వారు ఎవరైనా వ్యాపారానికి సాయం కావాలంటే ఒకేసారి 75 వేల రూపాయలు ఇస్తామని, అమూల్, రిలయన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ, హిందూస్తాన్ లీవర్, తదితర సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. మహిళలతో వ్యాపారాలు పెట్టించి ఆయా సంస్థల ద్వారా డీలర్ల కంటే తక్కువ రేటుకే వస్తువులు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 78 వేల మంది మహిళలు కిరాణా షాపులు పెట్టుకున్నారని, 1.19 లక్షల మంది ఆవులు గేదెలు కొనుగోలు చేశారని వ్యాఖ్యానించారు.
శిక్షణ కోసం..
1510 కోట్లు బ్యాంకుల ద్వారా మహిళలకు సాయం అందించామన్నారు ముఖ్యమంత్రి జగన్. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకుల ద్వారా అనుసంధానించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.. ఎవరికైనా సహాయం, సలహాలు, శిక్షణ కావాలంటే 0866 2468899, 9392917899 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి కష్టాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి... ప్రభుత్వం కష్టాల కంటే మహిళల కష్టాలు ఎక్కువగా భావించి సాయం అందిస్తున్నామన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ ఉద్ఘాటించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో తొలిసారి 50 శాతం నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులు మహిళలకు ఇచ్చామన్నారు. మహిళలకు భద్రత కల్పించడం సహా మంచి చేయాలని ప్రతి అడుగులోనూ చర్యలు తీసుకున్నామన్నారు.
కలచి వేసింది..
ప్రకాశం బ్యారేజీ వద్ద యువతిపై జరిగిన అత్యాచార ఘటన మనసును కలచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకూడదని, ఆడవాళ్లు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగగలినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని గట్టిగా నమ్ముతానన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకంలో వివిధ జిల్లాల లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం.. కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.
ఇదీ చదవండీ... యువతిపై అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది: సీఎం