స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్న ఎన్నికల హామీ నేడు అమలోకి వస్తోంది. సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి అప్పు తీసుకునే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ప్రారంభిస్తున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లోని సంబంధిత శాఖల అధికారులు, పలువురు లబ్ధిదారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. పథకం ఉద్దేశంపై మాట్లాడతారు.
ఒకే విడతలో నగదు జమ
అనంతరం సీఎం బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8 లక్షల 78 వేల 874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఒకే విడతలో నగదు జమఅవుతాయని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. 90 లక్షల 37 వేల 254 మహిళా సభ్యులకు వారి సంఘాల ఖాతాల్లో 1,400 కోట్లు ఒకే విడతలో జమఅవుతాయి. ముఖ్యమంత్రి జగన్ పొదుపు సంఘాల మహిళలకు వ్యక్తిగతంగా ఈ మేరకు లేఖ రాశారు. పథకం అమలు చేసే ఉద్దేశం తెలియజేస్తూనే... వడ్డీ డబ్బులు ఎంత జమ చేసిందన్న వివరాలను మహిళలకు సీఎం లేఖలో తెలియజేశారు.
సీఎం లేఖ
కరోనా నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తూనే సీఎం వ్యక్తిగతంగా రాసిన లేఖను గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలకు అందజేసే ఏర్పాటు చేశారు. నగదు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్, మెప్మా అధికారుల ఫోన్ నంబర్లు లేఖతో పాటే అందజేస్తారు. సున్నా వడ్డీని ఏ కారణంతో అమలు చేస్తున్నారనే విషయాన్ని మహిళలకు రాసిన లేఖలో సీఎం సవిరంగా తెలిపారు. పాదయాత్రలో స్వయం సహాయ సంఘాల సభ్యుల కష్టాలు చూసి హామీ ఇచ్చినట్లు సున్నా వడ్డీ పథకాన్ని తెచ్చామని లేఖలో ముఖ్యమంత్రి తెలిపారు.
వడ్డీ భారం కాకూడదనే
పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి.. మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13 శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని... ఈ వడ్డీ భారం పేద అక్క చెల్లెమ్మలకు భారం కాకుండా ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వమే ఆ వడ్డీ భారం భరిస్తూ మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అందిస్తుందని లేఖలో సీఎం తెలిపారు.
ఇదీ చదవండి : వైకాపా నేతలపై డీజీపీకి తెదేపా నేత వర్ల ఫిర్యాదు