అధికారంలోకి వచ్చాక చేపడుతున్న తొలి ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు వైకాపా సిద్ధమైంది. శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్లీనరీ నిర్వహించనున్నారు. తొలి రోజు లక్ష మంది, రెండోరోజు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రసంగ సమయానికి 3 నుంచి 4 లక్షల మంది హాజరయ్యేలా జన సమీకరణకు వైకాపా నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ నియమావళిలో సవరణనూ ప్లీనరీ వేదికగా చేయనున్నారు. పార్టీ గౌరవాధ్యక్ష పదవిని రద్దు చేయడం, సంస్థాగత నిర్మాణంలో మార్పులు వంటివి ఆ సవరణల్లో ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. సవరణ ఏమిటనే కచ్చితమైన సమాచారం బయటకు రావడం లేదు.
ప్లీనరీలో సుమారు 10 రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. పార్టీ కమిటీలను జగన్ ప్రకటించనున్నారు. రెండోరోజు సాయంత్రం జగన్‌ను పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నుకోనున్నారు. తర్వాత ఆయన వైకాపా అధ్యక్షుడి హోదాలో సాయంత్రం 4 గంటలకు ప్లీనరీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. వచ్చే ఎన్నికలకు వైకాపా కార్యాచరణను, పార్టీ విధాన నిర్ణయాలనూ ఆయన ప్రకటించనున్నారు. ప్లీనరీ వేదికకు వైఎస్సార్ ప్రాంగణం అని నామకరణం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు ఇలా సుమారు 400 మంది వరకు కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. రెండు రోజులు కలిపి సుమారు మూడున్నర లక్షల మందికి భోజనాలు తయారుచేస్తున్నారు. 25 టన్నుల తాపేశ్వరం కాజాలను తెప్పిస్తున్నారు.
తొలి రోజు షెడ్యూల్ ఇదీ..
శుక్రవారం ఉదయం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ముఖ్యమంత్రి జగన్ ప్లీనరీని ప్రారంభించనున్నారు. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి, ఇతర నేతలు నివాళులర్పిస్తారు. అనంతరం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రకటించనున్నారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. తొలి రోజు 5 తీర్మానాలు చేయనున్నారు. శనివారం ఉదయం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందేశమిస్తారని షెడ్యూల్‌లో పొందుపరిచారు. సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ గంటన్నర పైగా ప్రసంగించనున్నారు.
ప్లీనరీలోకి వందల సంఖ్యలో బడి బస్సులు
వైకాపా ప్లీనరీకి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు, కార్యకర్తలను తరలించేందుకు భారీగా ప్రైవేటు బడుల బస్సులను తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ బస్సులను ప్లీనరీకి జనాలను తరలించేందుకు ఇవ్వాల్సిందేనని ఇప్పటికే నేతలు గట్టిగా చెప్పారు. దీంతో రవాణాశాఖ అధికారులు విద్యా సంస్థల నిర్వాహకులతో మాట్లాడారు. కిరాయి ఇచ్చేది లేదని, డీజిల్ నింపి, డ్రైవర్ బత్తా మాత్రమే ఇస్తారని.. బస్సులు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవని రవాణాశాఖ అధికారులు చెప్పినట్లు తెలిసింది. దాదాపు అన్ని విద్యాసంస్థలు బస్సులను పంపేందుకు సిద్ధమయ్యాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్ విజయవాడ, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి, అమలాపురం జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో బస్సులు సిద్ధం చేశారు.
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల నుంచి 40-50 బస్సుల చొప్పున, ఇతర జిల్లాల్లోని నియోజకవర్గాల నుంచి 15-20 చొప్పున బస్సులు బయలుదేరేలా రవాణాశాఖ అధికారులు మాట్లాడినట్లు తెలిసింది. మే చివర్లో ఒంగోలులో తెదేపా మహానాడుకు ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు పంపకూడదంటూ ఒత్తిడి తెచ్చిన రవాణాశాఖ అధికారులు.. ఇప్పుడు అధికార పార్టీ ప్లీనరీకి దగ్గరుండి బస్సులు సమకూర్చే పనిలో ఉన్నారు. మహానాడుకు కార్యకర్తలు, నాయకులను తీసుకెళ్లేందుకు తెదేపా నేతలు ఏపీఎస్‌ఆర్టీసీ బుక్ చేసుకోవడానికి చూస్తే.. ఆర్టీసీ అధికారులు అవకాశమివ్వలేదు. ఇప్పుడు వైకాపా ప్లీనరీకి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పించారు.
ఇదీ చూడండి : టీచర్ కావాలని విద్యార్థులు వేడుకోవడం బాధాకరం: లోకేశ్