అమరావతి పరిసరాల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు భూములు కొన్నారని... ఇప్పుడు రాజధాని మార్పుతో వాళ్లంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు. దాచుకున్న సొమ్ముతో వాళ్ళంతా స్థలాలు కొనుక్కున్నారని.. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ తన నిర్ణయంపై పునరాలోచించాలని ఆయన సూచించారు. ఎన్నో ఆశలతో అమరావతిలో చిన్న చిన్న ప్లాట్స్ కొనుక్కున్నారని, వారికి ఇబ్బందులు కలిగించొద్దంటూ విజ్ఞప్తి చేశారు. రాజధానిని కాపాడుకోవడానికి రాజీనామాలు అవసరం లేదని... రాష్ట్రవ్యాప్తంగా రిఫరెండం పెడితే సరిపోతుందన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయాలు తీసుకోవచ్చని సూచించారు.
రాజధాని లేకుండా న్యాయమెలా చేస్తారు
ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని.. ఇలాంటి సమయంలో రాజధాని మార్పు శ్రేయస్కరం కాదని రఘురామ హితవు పలికారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలంటే రూ. 80వేల కోట్లు కావాలని.. ఈ విషయం విభజన చట్టంలోనూ స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. రాజధానిని తరలించి రైతులకు ఏ విదంగా న్యాయం చేయగలరని ప్రశ్నించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. రైతులకు న్యాయం చేయాలని మాట్లాడే నాయకులు... రాజధాని తరలింపుతో వారికి ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతుల కన్నీటి వెతలు ఇంకెన్నాళ్లంటూ ప్రశ్నించారు.
దూరదృష్టి లేకపోవడం వలనే
అమరావతికి ఎంత ఖర్చు చేశారని హైకోర్టు అడగడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డ వైకాపా ఎంపీ... కోర్టు నిర్ణయాలపై ఇష్టానుసారంగా వ్యాఖ్యానిస్తున్నారని పార్టీ నేతలను విమర్శించారు. అందరూ సంయమనం పాటించాలని సీఎం జగన్ కోరితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక మాజీ న్యాయాధికారి సంభాషణలు బయటకు వచ్చాయని... అలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వానికి మంచిది కాదని సూచించారు. వాటిపై ముఖ్యమంత్రి దృష్టి పెడితే బాగుంటుందన్నారు. పార్టీ నాయకులు తెరచాటు వాటిపై దృష్టి పెట్టకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. న్యాయ వ్యవస్థపై చేస్తున్న దుష్ప్రచారం ప్రభుత్వానికి నష్టం చేస్తుందని హితబోధ చేశారు. దూరదృష్టి లేకపోవడం వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.
2024లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న భాజపా రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు.. రాజధానిపై చేసిన వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తిని బెదిరించడం కూడా సరైంది కాదని... ఆయనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...
'వచ్చే శ్రావణ శుక్రవారంలోపు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి'