గత ప్రభుత్వంపై నిందలు వేయడం వైకాపా చేతకానితనానికి నిదర్శనమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వేలకోట్ల బిల్లులు పెండింగ్ పెట్టినట్లు తెదేపా ప్రభుత్వంపై సీఎం జగన్ ఆరోపించడం సరి కాదన్నారు. ఆర్థికలోటు, విభజన కష్టాలు, పెండింగ్ బిల్లులతో ఉన్న రాష్ట్రాన్ని తెదేపా ప్రభుత్వం ఒక గాడిలోకి తెచ్చిందన్నారు.
4 నెలల్లోనే తన ఇంటికి 16కోట్లు ఖర్చు చేసి..... ఒక్క పైసా వృథా చేయవద్దని అధికారులకు చెప్పడం హాస్యాస్పదమని యనమల ఎద్దేవా చేశారు. రంగులకే వందల కోట్లు దుబారా చేసి.. పొదుపుపై నీతివ్యాఖ్యలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వాలంటీర్లు, సచివాలయాల ముసుగులో ఏడాదికి 8వేల కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ శీతాకాల సమావేశాలను 15రోజులు నిర్వహించాలని యనమల డిమాండ్ చేశారు.