Yadadri Temple: తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ప్రక్రియలో ఇవాళ కీలక ఘట్టం ప్రారంభం కానుంది. పంచనారసింహుల ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా నిర్వహించనున్న పంచకుండాత్మక మహాయాగానికి ఇవాళ అంకురార్పణ జరగనుంది. పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం మహాయాగం నిర్వహణకు బాలాలయంలోని యాగశాలలో పంచకుండాలను సిద్ధం చేశారు. నారసింహుడి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు ఆదిపూజలకు తెర తీస్తామని దేవస్థానం ఈవో గీత, ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య తెలిపారు.
బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని.. మహారాజాభిషేకంగా చేపడతారు. ఇందుకు 108 కలశాలను అలంకరించి... 108 దేవతారాధనలు జరిపి విశిష్ట అభిషేకం నిర్వహించనున్నారు. పంచకుండాత్మక మహాయాగం నిర్వహణకు బాలాలయంలో కుండాలను ఏర్పరిచి, ద్రవ్యాలు సమకూర్చారు. మహాయాగాన్ని నిర్వహించేందుకు 108 మంది పారాయణికులను రప్పించారు. ప్రధానాలయంలోని పరిసరాలను శుద్ధి చేశారు. భక్తులు దైవదర్శనంతోపాటు యాగాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
పేదలపై నాలా పిడుగు... గగ్గోలు పెడుతున్న బాధితులు