yadadri: తెలంగాణలోని యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ఉద్ఘాటనకు స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహణలో ఆచారపర్వాలు అయిదు రోజులుగా కొనసాగుతున్నాయి. ఈరోజు జరగనున్న మహాక్రతువు ఉత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు.
ఉద్ఘాటన పర్వాలు పూర్తయ్యాక పార్వతీ పరమేశ్వరుల నిజరూపాల దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు. ఆదివారం ఉదయం శివాలయం చెంత యాగశాలలో ద్వారతోరణం, శత రుద్రాభిషేకం, మహారుద్ర పురశ్చరణ, మూలమంత్రానుష్ఠానం, వేద హవనం, అధివాస హోమం నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు రుద్ర హవనం, ప్రాసాద స్నపనం, కూర్మశిల, బ్రహ్మశిల, పిండికా స్థాపనం, శయ్యాధివాసం, పుష్పాధివాసంతోపాటు ప్రాసాదాధివాసం పర్వాలను శాస్త్రోక్తంగా కొనసాగించారు.
ఈ పర్వాలతో స్ఫటిక లింగ ప్రతిష్ఠాపనకు రంగం సిద్ధమైంది. స్వర్ణ కలశాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేక మహోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. రంగంపేట(రాంపురం) ఆశ్రమ పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి నేతృత్వంలో ఆయా విశిష్టపర్వాలు కొనసాగుతాయని ఈవో గీత వెల్లడించారు. ఆదివారం యాదాద్రి క్షేత్ర సందర్శనకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరవడంతో సందడి నెలకొంది. దైవదర్శనాలు, ప్రసాదాల కొనుగోలుకు భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: Minister Appalaraju: పలాస ఆస్పత్రిలో వైద్యం చేసిన మంత్రి అప్పలరాజు