ఈనెల 31 తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలు మరింత సడలించనున్నారు. వాటిలో మెట్రోరైళ్లు ఉంటాయా! లేదా! అనే అంశంపై స్పష్టత రాలేదు. కేంద్రం అనుమతి ఇచ్చినా హైదరాబాద్ పశ్చిమ మండలంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొంత ఆలస్యంగా మెట్రోరైళ్లను ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. అనుమతి రాగానే మెట్రో నడిపేందుకు మూడు కారిడార్లలో ట్రయల్‌రన్స్ నిర్వహిస్తున్నారు.
పునఃప్రారంభం వరకూ మెట్రోరైళ్ల సర్వీసులు హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా కొవిడ్ జనతాకర్ఫ్యూ మార్చి 22వ తేదీ నుంచి నిలిచిపోయాయి. ఇప్పటికే రెండు నెలలు దాటింది. నిర్వహణ కోసం ఎల్‌అండ్‌టీ మెట్రో రోజూ రెండు కారిడార్లలో రెండేసి మెట్రోరైళ్లను నడుపుతోంది. ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలిస్తోంది. బుధవారం కారిడార్-1 మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ మార్గంలో ట్రయల్ రన్స్ నిర్వహించారు. పునఃప్రారంభం వరకు ఇది కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఎలా నడుపుతారు?
మెట్రోరైళ్లను ఇదివరకు మాదిరి లాక్‌డౌన్ అనంతరం నడపడం కుదరదు. నిత్యం లక్షల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కాబట్టి కొవిడ్-19కి ఆస్కారం లేకుండా కొద్దినెలల పాటు ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి. ఇప్పటికే పలు దఫాలు దేశంలోని వేర్వేరు మెట్రోరైలు ఎండీలు వీటిపై దూరదృశ్య మాధ్యమం ద్వారా చర్చించారు. అంతిమ నిర్ణయం కేంద్రం తీసుకోవాల్సి ఉంది.
- మెట్రోరైళ్ల లోపల, స్టేషన్ ఫ్లాట్‌ఫాం, స్టేషన్లలోని టికెట్ కౌంటర్, తనిఖీ మార్గాల వద్ద ప్రయాణికులు ఎంతదూరంలో నిలబడాలనేది మార్కింగ్ చేయాలి. వేర్వేరు దేశాల్లో మెట్రోలో మధ్యలో ఒక సీటు ఖాళీగా వదిలి ఎడం పాటించేలా మార్కింగ్ వేస్తున్నారు. నిలబడి ప్రయాణించేవారు ఎక్కడ, ఎంతదూరంలో ఉండాలనేది మార్కింగ్ చేస్తున్నారు. మనదగ్గర కూడా ఇవే విధానాలను అనుసరించనున్నారు.
- ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు తీసుకోవాలి. క్యూఆర్ ఆధారిత టిక్కెట్లతో మొబైల్ నుంచే స్కానర్‌పై చూపించి వెళ్లవచ్చు.ఎవరైనా టోకెన్, కార్డు ఉపయోగిస్తుంటే ప్రవేశమార్గంవద్ద రీడర్‌కు తగలకుండా కొంతఎత్తు నుంచే చూపించాలి.
- స్టేషన్‌లోపల శానిటైజర్ టన్నెల్, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.మాస్క్ ఉంటేనే అనుమతిస్తారు.
- తక్కువ మందిని లోపలికి అనుమతించాలి. రద్దీగా ఉండేచోట వచ్చిపోయేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి.
- ప్రవేశం వద్ద ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ విధిగా చేయాలి.జ్వరం, దగ్గు, జలుబు ఉంటే అనుమతించరు. ఎస్కలేటర్ మీద ఇద్దరి మధ్య 5 మెట్లు ఖాళీగా వదిలిపెట్టాలి.
- లిఫ్ట్‌లో ఎక్కితే ఆసుపత్రిలో మాదిరి ముఖాన్ని లిఫ్ట్ వైపు ఉండేలా చూసుకోవాలి.
- కొవిడ్-19 అనుమానిత లక్షణాలతో ఎవరైనా స్టేషన్‌లోకి వస్తే వారిని ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా ప్రతి స్టేషన్‌లో 20వరకు పీపీఈ కిట్లను సమకూర్చుకోవాలి.
- మెట్రోరైళ్ల లోపలి భాగాలను ఎప్పటికప్పుడు క్రిమిరహితం చేసేందుకు శుభ్రం చేయాలి.
ఒక్కరోజు ముందు చెబితే చాలు..
మెట్రోపై కేంద్రం మార్గదర్శకాలు ఇంకా రాలేదు. అవి వచ్చిన తర్వాత రాష్ట్రప్రభుత్వం అనుమతిస్తే మెట్రో పరుగులు తీస్తుంది. ప్రయాణికుల ఆరోగ్యం, భధ్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నడిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పటి నుంచి నడపాలనేది ప్రభుత్వం ఒక్కరోజు ముందు చెబితేచాలు. నడిపేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రో సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్‌లోనూ మెట్రోరైలు వ్యవస్థల పనితీరును తెలుసుకునేందుకు రోజూ 2 మెట్రోరైళ్లు తిరుగుతూనే ఉన్నాయి.
- ఎన్వీఎస్‌రెడ్డి, ఎండీ, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ
ఇది చదవండి లాక్‌డౌన్ 5.0: ఈ నగరాలకే పరిమితం!