Abdullahpurmet Accident : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌కి చెందిన గంగనమోని శ్రీనివాస్.. తన భార్య జయమ్మతో కలిసి ద్విచక్రవాహనంపై బండరావిరాలకు బయలుదేరారు. అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా కవాడిపల్లి గ్రామ ముఖద్వారం వద్దకు చేరుకుంటుండగా.. వెనుక నుంచి మెరుపువేగంతో వచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది. చూస్తుండగానే ద్విచక్రవాహనం అదుపు తప్పడం.. శ్రీనివాస్, జయమ్మ రోడ్డుపై పడిపోవటం.. గాయాలు కావటం.. ఒళ్లంతా రక్తమయవటం జరిగిపోయాయి.
Abdullahpurmet Accident Today : జరిగిన ఘటనతో.. ఒక్క నిమిషం ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉండిపోయాడు శ్రీనివాస్. కళ్ల ముందు రక్తమోడుతున్న భార్య జయమ్మను చూడగానే.. ఒక్కసారిగా తేరుకున్నాడు. ఎలాగైనా భార్యను కాపాడుకోవాలని ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు. "జయమ్మా.. జయమ్మా.. కళ్లు తెరువు.. ఏం కాలేదు.. ఏం కాదు.. నన్ను చూడు.." అంటూ గద్గద స్వరంతో పిలుస్తూనే.. స్పృహ కోల్పోకుండా ఉండేందుకు కుదుపుతున్నాడు. ఈ క్రమంలో.. శ్రీనివాస్ ఒళ్లోనే జయమ్మ తుది శ్వాస విడిచింది. చూస్తుండగానే.. తన చేతుల్లోనే భార్య ప్రాణాలు పోవటంతో శ్రీనివాస్ బోరుమన్నాడు. అక్కడే ఉన్న స్థానికులు శ్రీనివాస్‌ను వనస్థలిపురం ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్రమాదానికి కారణమైన కారు.. కొంత దూరం అలాగే దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి వెళ్లి ఆగిపోయింది. కారు డ్రైవరు పరారయ్యాడు. కారులో తినుబండారాలు, ఖాళీ మద్యం సీసా, గ్లాసులు కనిపించాయి. వీటన్నింటిని బట్టి.. డ్రైవర్ మద్యం మత్తులోనే వాహనం నడిపి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: