Weather Report: వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. భువనేశ్వర్‌కు ఉత్తరాన 70 కి.మీ దూరంలో ఉన్న వాయుగుండం.. బుధవారం నాటికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. అల్పపీడన కేంద్రం మీదుగా వెళ్తున్న రుతుపవన ద్రోణి.. ఆగ్నేయ దిశగా ఉత్తర అండమాన్ సముద్రం వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించిందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు వరద పెరిగింది. మంగళవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజికి 7.74 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశామని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు.
నేడు కేంద్ర బృందాల పర్యటన: కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు రవినేశ్‌కుమార్ నేతృత్వంలోని కేంద్ర బృందాలు గోదావరి వరద ముంచెత్తిన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరుజిల్లాల్లో, గురువారం అంబేడ్కర్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: