గత రెండున్నరేళ్లలో చెల్లించిన డీఏ మొత్తాన్ని తిరిగి ఇచ్చివేయాలని అధికారులు చెబుతుండటంతో రాష్ట్రంలో వీఆర్‌ఏలు ఆందోళన బాటపట్టారు. డీఏగా చెల్లించిన రూ.8,800ను ఇప్పుడు ఒకేసారి తిరిగి ప్రభుత్వానికి జమ చేయమంటే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వీఆర్‌ఏలకు నెలకు రూ.10,500 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది. దీనికి అదనంగా ప్రతి నెలా డీఏ కింద రూ.300 చెల్లించేవారు. అయితే సాంకేతిక కారణాలను చూపి ఇప్పటి వరకూ చెల్లించిన డీఏని ఒకేసారి వెనక్కి ఇచ్చేయాలని అధికారులు వీఆర్‌ఏలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. దీనికి స్పందన తక్కువగా ఉందన్న కారణంతో గత రెండు నెలల నుంచి వీరికి ఇచ్చే రూ.10,500 గౌరవ వేతనాన్ని నిలిపివేసే చర్యలు మొదలుపెట్టారు. అయితే నెలల వారీగా చెల్లించిన డీఏ మొత్తాన్ని ఒకేసారి వెనక్కి కట్టాలని చెబితే.. తాము అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి తేవాలని వీఆర్‌ఏలు వాపోతున్నారు.
20వేల మందికి ఇబ్బందే..
వీరికి ప్రతినెలా గౌరవ వేతనం రావాలంటే... తహశీల్దార్ కార్యాలయాల నుంచి బిల్లులు ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లాలి. అయితే డీఏ తిరిగి చెల్లిస్తేనే వేతనాల కోసం బిల్లులు పెడతామని తహశీల్దార్లు చెబుతుండటంతో వీఆర్‌ఏలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20వేల మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ విరమణ లేదు. వీఆర్‌ఏల్లో కొందరు గత యాభై ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. వంశపారంపర్యంగా కొనసాగుతున్న వారు ఉన్నారు. రూ.6 వేల వరకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 2018 అక్టోబరులో రూ.10,500 చేశారు. ఇదే సమయంలో రూ.100 డీఏని రూ.300 చేశారు. దీనివల్ల వీరికి రూ.10,800 గౌరవ వేతనం కింద అందుతోంది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఈ మొత్తాన్ని చెల్లించింది. గతేడాది జులైలో డీఏ చెల్లింపునకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల్లో లోపాలు ఉన్నందున రికవరీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. పూర్వ జీఓను సవరించి, కొనసాగించాలని న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం, భూ పరిపాలన శాఖ అధికారులకు ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా ఫలితం కనిపించ లేదు. డబ్బు చెల్లించనందున వేతనాలు నిలిపివేస్తున్నామంటూ కొన్నిచోట్ల రెండు నెలల నుంచి వేతనాలు ఇవ్వడంలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం... ఒక్కో వీఆర్‌ఏ ఏడాదికి రూ.3,600 చొప్పున తిరిగి వెనక్కి చెల్లించాలి. దీని ప్రకారం రూ.8,800 చెల్లించాల్సి రావడంతో వీఆర్‌ఏల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఏ మొత్తాన్ని యథావిధిగా కొనసాగించాలని వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు పెద్దన్న, ప్రధాన కార్యదర్శి బాలకాశి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ తమకు గౌరవ వేతనంగా రూ.21వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళన బాటలో..
తమ డిమాండ్ల సాధన కోసం. విజయవాడలో రాష్ట్ర స్థాయి దీక్షలు మార్చి 9న నిర్వహిస్తారు. అలాగే ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని మార్చి 10న నిర్వహిస్తున్నట్లు వీఆర్‌ఏల సంఘం నేతలు మంగళవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల కేంద్రాల్లో ఈ నెల 8 నుంచి మొదలైన రిలే దీక్షలు 28వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. మార్చి 3, 4 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు దీక్షలు చేపడతామన్నారు. వీరు విధులకు దూరంగా ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారిక కార్యక్రమాల అమలులో సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: ఏబీజీ షిప్‌యార్డు ఛైర్మన్‌పై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు