పశుపక్ష్యాదులు, పెంపుడు జంతువులూ విషవాయు ధాటికి ప్రాణాలు కోల్పోగా- మరణాన్ని శ్వాసిస్తూ నడివీధుల్లో ఒరిగిపోయిన పిన్నలూ పెద్దలు అనుభవించిన నరకయాతన చెప్పనలవికాదు. నిరంతరం నిర్వహణ అవసరమైన ప్లాంటుకు లాక్‌డౌన్ పెనుశాపమైందన్న వాదనతో ఎల్‌జీ పాలిమర్స్ తన బాధ్యతను దులపరించేసుకోలేదు. వందేళ్లు పైబడిన చక్కెర కర్మాగారం పరిశుభ్రత కొరవడిన కారణంగా అగ్ని ప్రమాదానికి లోనై 14మంది సిబ్బందిని బలిగొందంటూ- బహుముఖంగా భద్రతాంశాలపై దృష్టి సారించాలని మొన్న జనవరిలోనే ఎల్‌జీ పాలిమర్స్ సంస్థాగత వార్తాలేఖ వెలువరించింది.
చట్టబద్ధ నిబంధనలకు కట్టుబడుతూ పర్యావరణ ఆరోగ్య భద్రతాంశాల్లో అత్యుత్తమ పద్ధతులు పాటించి, సామాజిక బాధ్యతగా స్థానికుల్లోనూ వాటి మెరుగుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. వాటిని నిర్లక్ష్యం చెయ్యబట్టే ఇంత ఉత్పాతం జరిగిందన్నది నిజం. నష్ట పరిహారంలో సహేతుకంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, భోపాల్ అనుభవాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
ఇండియా స్థూల దేశీయోత్పత్తిలో మూడు శాతం వాటా కలిగిన రసాయన పరిశ్రమ- పెట్రోకెమికల్స్, ఎరువులు, పెయింట్లు, క్రిమిసంహారకాలు, బల్క్ డ్రగ్స్, ఔషధాల రూపేణా బహుముఖంగా విస్తరించి 70వేలకుపైగా వాణిజ్య ఉత్పాదనలతో విరాజిల్లుతోంది. రసాయన పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాల్ని 15చట్టాలు, 19 నిబంధనలూ నియంత్రిస్తున్నా- అవేవీ నేరుగా పరిశ్రమను దృష్టిలో ఉంచుకొని చేసినవి కాకపోవడం, 2012నుంచి జాతీయ రసాయన విధానం పెండింగులో ఉండటం నివ్వెరపరుస్తోంది.
వేలమందిని బలిగొని, లక్షల మందిని రోగగ్రస్తుల్ని చేసి, భవిష్యత్ తరాలనూ పీడకలలా వెంటాడిన భోపాల్ విషాదం తరవాత రసాయన రంగంపై తీవ్ర వ్యతిరేకత కనబరచిన కేంద్రం, ఆర్థిక సంస్కరణల దరిమిలా పెట్టుబడుల ఆకర్షణకు సానుకూల ధోరణి ప్రదర్శిస్తోంది. రసాయన పరిశ్రమలో గత మూడేళ్లుగా నెలకు సగటున నాలుగు భారీ ప్రమాదాలు జరిగిన తీరు- రసాయనాల వినియోగం, ఉత్పత్తి, భద్రతలను నియంత్రించే సమగ్ర చట్టం లేని లోటును పట్టిస్తోంది.
ప్రస్తుతం 16,300 కోట్ల డాలర్లుగా ఉన్న దేశీయ రసాయన పరిశ్రమ పరిమాణం 2025 నాటికి 30,400 కోట్ల డాలర్ల స్థాయికి విస్తరించనుందని; గుజరాత్‌లోని దెహెజ్, ఒడిశాలోని పరదీప్, తమిళనాట కడలూర్‌తో పాటు ఏపీలోని విశాఖపట్నాన్నీ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నామని కేంద్రం చెబుతోంది. దీపం కిందనే చీకటి తారట్లాడినట్లు ప్రమాదకరమైన రసాయన పరిశ్రమలో వికాసాన్ని వెన్నంటి ఉన్న వినాశాన్ని అలక్ష్యం చేయకూడదు. జనావాసాలకు దూరంగా అత్యధునాతన భద్రతా ఏర్పాట్ల నడుమే ఆ పరిశ్రమల్ని అనుమతించాలి. ఏటా డిసెంబరు 4న రసాయన ప్రమాదాల నివారణ దినోత్సవం జరపడంతో సరిపోదు- పారిశ్రామిక భద్రతకు యాజమాన్యాలు, ప్రభుత్వాలు పూచీ పడినప్పుడే పౌరుల ప్రాణాలకు భరోసా దక్కేది.
ఇదీ చదవండి : అప్పుడు జగన్ కారు దిగిపోయిన విజయసాయిరెడ్డి