Cinema Exhibitors Meeting: కర్ఫ్యూ సమయంలో థియేటర్లకు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వానికి సినిమా ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్లు రాత్రి 12 గంటల వరకూ థియేటర్లకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. రాత్రి కర్ఫ్యూతో 3 షోలకే పరిమితం కావాల్సి ఉంటుందని థియేటర్ యజమానులు తెలిపారు.
సినిమా టికెట్ ధరల అంశంపై అమరావతి సచివాలయంలో.. కమిటీ సమావేశం నిర్వహించింది. జీవో నెంబర్ 35 ప్రకారమే ధరలు ఉండాలని కమిటీకి సూచించినట్లు.. కమిటీ సభ్యురాలు లక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ ధరలు పెంచాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు వెల్లడించారు. టికెట్ ధరలపై విస్తృతంగా చర్చించిన కమిటీ సభ్యులు వివిధ అంశాలను ప్రస్తావించారు.
కొనసాగుతున్న చర్చలు
సినిమా టికెట్ ధరలపై మంగళవారం కమిటీ సమావేశం జరిగింది. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలోని 13 మంది సభ్యుల కమిటీ భేటీ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ ధరలు పెంచాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు కమిటీ సభ్యురాలు లక్ష్మి తెలిపారు. ఈ వ్యవహారంపై.. విస్తృతంగా చర్చించిన అనంతరం తదుపరి సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. థియేటర్లలోని వసతులు, అగ్నిమాపక శాఖ విధించే నిబంధనల అమలుపై కూడా చర్చించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లలో స్వల్పంగా ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.
'టికెట్ ధరల నిర్ధారణపై చర్చించాం. బీ, సీ సెంటర్లలో ధరలు మార్పు చేయాల్సి ఉంది. థియేటర్లలో వసతులు, అగ్నిమాపక నిబంధనలపై చర్చించాం. వచ్చే సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది' -ముత్యాల రాందాస్, కమిటీ సభ్యుడు
'సినిమా టికెట్ ధరలు పెంచాలని కమిటీకి సూచించా. ధరల తగ్గింపుతో థియేటర్లకు ఇబ్బంది కలుగుతుంది. 200కు పైగా థియేటర్లు మూతపడ్డాయి. నిబంధనల విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరాం' -బాలరత్నం, ఎగ్జిబిటర్, కమిటీ సభ్యుడు
ఇదీ చదవండి : Perni Nani On Cinema Tickets: సినిమా టికెట్ల వ్యవహారం తప్ప ఇంకేం లేదా?: పేర్ని నాని