Heavy Temperatures in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా కుమురం భీం జిల్లా కెరిమెరిలో 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా చాప్రాల, జైనథ్‌లో 43.8 డిగ్రీలు... కుమురం భీం జిల్లా కౌతాలలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భూపాలపల్లి జిల్లా కాటారంలో 43.6, ఆదిలాబాద్‌లో 43.3, నిజామాబాద్ మక్లూర్ మండలం లక్మాపూర్‌లో 43.1, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో 43.1, యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం వెంక్రియాల్‌లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజుల పాటు ఎండలు మరింత పెరుగుతాయని... 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
పదకొండున్నర గంటల వరకే: పెరుగుతున్న ఎండల దృష్ట్యా విద్యాశాఖ అప్రమత్తమైంది. బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఉదయం పదకొండున్నర గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 30 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. కుదిరించిన వేళలు ఏప్రిల్ 6 వరకు కొనసాగించాలని తెలిపింది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని... అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎండల ప్రభావంతో కలిగే ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు తెలిపారు.
ఇదీచూడండి: Tirumala : అప్పటి నుంచి తిరుమలలో అన్నిరకాల సేవలు పునరుద్ధరణ