prawns recipe : మలై ప్రాన్స్ కర్రీ
కావలసినవి: రొయ్యలు: పదిహేను, పసుపు: పావుచెంచా, నూనె: పావుకప్పు, గరంమసాలా: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, అల్లం ముద్ద: చెంచా, కారం: చెంచా, వేడినీళ్లు: మూడు టేబుల్‌స్పూన్లు, చిక్కని కొబ్బరిపాలు: ముప్పావుకప్పు, నెయ్యి: ఒకటిన్నర చెంచా, పచ్చిమిర్చి: మూడు, ఉప్పు: తగినంత, దాల్చినచెక్క: ఒక ముక్క, లవంగాలు: నాలుగు, యాలకులు: మూడు, బిర్యానీఆకులు: రెండు.
తయారీ విధానం: రొయ్యలపైన పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. పది నిమిషాలయ్యాక ఈ రొయ్యల్ని రెండు చెంచాల నూనెలో దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీఆకుల్ని వేయించుకోవాలి. ఇందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకుని తరువాత అల్లం ముద్ద, కారం, వేడినీళ్లు పోయాలి. అయిదు నిమిషాలయ్యాక కొబ్బరిపాలు, రొయ్యలు, నెయ్యి, గరంమసాలా వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. రొయ్యలు ఉడికి, కూర దగ్గరకు అయ్యాక దింపేయాలి.
మసాలా కర్రీ
కావలసినవి: రొయ్యలు: కేజీ, జీలకర్ర: రెండు చెంచాలు, వేయించిన మెంతులు: పావుచెంచా, దనియాలు: రెండు చెంచాలు, ఉల్లిపాయముక్కలు: అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, అల్లం తరుగు: రెండు చెంచాలు, టొమాటోలు: ఆరు, నూనె: అరకప్పు, ఆవాలు: టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు: నాలుగు, కారం: నాలుగుచెంచాలు, పసుపు: చెంచా, చింతపండు రసం: పావుకప్పు, ఎండుమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, గరంమసాలా: చెంచా, కొత్తిమీర తరుగు: అరకప్పు.
తయారీ విధానం: ముందుగా కొత్తిమీర, ఉల్లిపాయముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి మిక్సీలో వేసుకుని నీళ్లు చల్లుకుంటూ మెత్తని పేస్టులా చేసుకుని తీసుకోవాలి. టొమాటో ముక్కల్ని కూడా మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర, దనియాలు, మెంతుల్ని కూడా పొడిచేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు వేయించి తరువాత కొత్తిమీర మిశ్రమం వేయాలి. అది పూర్తిగా వేగాక కరివేపాకు, కారం, తగినంత ఉప్పు, జీలకర్రపొడి, పసుపు, టొమాటో పేస్టు వేసుకుని స్టౌని మీడియంలో పెట్టి బాగా మగ్గనివ్వాలి. టొమాటో గుజ్జు ఉడికిందనుకున్నాక చింతపండు రసం, రొయ్యలు, గరంమసాలా వేసి కలిపి మూత పెట్టాలి. అన్నీ ఉడికి.. కూర దగ్గరకు అయ్యాక దింపేయాలి.
మంచూరియా
కావలసినవి: శుభ్రంచేసిన రొయ్యలు: నలభై, నూనె: వేయించేందుకు సరిపడా, వెల్లుల్లి తరుగు: రెండు పెద్ద చెంచాలు, అల్లం తరుగు: రెండు పెద్ద చెంచాలు, పచ్చిమిర్చి: అయిదు, ఉల్లిపాయలు: రెండు, క్యాప్సికం: రెండు, మైదా: అరకప్పు, మొక్కజొన్నపిండి: అరకప్పు, బేకింగ్‌పౌడర్: చెంచా, ఉప్పు: తగినంత, కారం: రెండు చెంచాలు. సాస్‌లకోసం: టొమాటోసాస్: అరకప్పు, సోయా సాస్: అయిదు చెంచాలు, వినెగర్: రెండు చెంచాలు, చిల్లీసాస్: రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం: ముందుగా సాస్‌లూ, వినెగర్‌ను ఓ గిన్నెలో వేసి కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో మైదా, మొక్కజొన్నపిండి, బేకింగ్‌పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకుని సరిపడా నీళ్లు పోస్తూ పల్చని పిండిలా చేసుకోవాలి. ఇందులో రొయ్యల్ని ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో రెండు పెద్ద చెంచాల నూనె వేసి అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం తరుగు వేసి వేయించుకోవాలి. అయిదు నిమిషాలయ్యాక సాస్‌లూ, తగినంత ఉప్పు, కారం వేసుకుని బాగా కలిపి... ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసి వాటికి ఈ మసాలా పట్టేలా కలిపి దింపేయాలి.
క్రిస్పీ ఫ్రై
కావలసినవి: రొయ్యలు: అరకేజీ, కారం: రెండు చెంచాలు, నిమ్మరసం: చెంచా, ఉప్పు: తగినంత, పసుపు: అరచెంచా, దనియాలపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: కొన్ని, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, మిరియాలపొడి: అరచెంచా, పచ్చిమిర్చి: రెండు, మొక్కజొన్నపిండి: టేబుల్‌స్పూను, బియ్యప్పిండి: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: ఓ గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యలు వేసుకోవాలి. వాటిపైన నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత వాటిని బయటకు తీసి రెండుమూడు రొయ్యలు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
ఇదీ చూడండి: