జోగులాంబ గద్వాల్- కర్నూల్ సరిహద్దులో ఉన్న రాజోలిబండ నీటి మళ్లింపు పథకం(ఆర్డీఎస్) ఆధునికీకరణకు ఆంధ్రప్రదేశ్ సహకరించడం లేదని తెలంగాణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిపుణుల కమిటీ సిఫార్సు ఆధారంగా ఆధునికీకరణ చేపట్టామని, పునర్విభజన తర్వాత సహకరించకపోగా అడ్డుకోవడం సరికాదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గురువారం తుంగభద్ర బోర్డు సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. బోర్డు ఛైర్మన్ రంగారెడ్డి అధ్యక్షత వహించారు. కేసీకాలువ, ఆర్డీఎస్‌లు బోర్డు పరిధిలోకి రావని, ఈ రెండింటిని తీసుకొన్న తర్వాత చర్చిద్దామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అన్నట్టు తెలిసింది. తెలంగాణ నిర్మించిన తుమ్మిళ్లను కూడా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కోరగా, తెలంగాణ ఈఎన్‌సీ జోక్యం చేసుకొని ఆర్డీఎస్ ఆధునికీకరణను అడ్డుకోవడం సమంజసం కాదని చెప్పారని సమాచారం.
తుమ్మిళ్లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలంటే తీసుకోమని చెప్పగా, కృష్ణా బేసిన్ మొత్తానికి బోర్డు వచ్చినపుడు అన్ని ప్రాజెక్టులు వస్తాయని తుంగభద్ర బోర్డు ఛైర్మన్ రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలకు వివిరించినట్లు తెలియవచ్చింది. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద పనులకు ఏపీ సహకరించకపోవడంతో పనులు పూర్తి కావడం లేదని తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: కర్ణాటక కొత్త జలాశయానికి ఏపీ ససేమిరా