తెలంగాణలో ఎమ్మెల్యే కోటా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల (TRS MLC Candidates ) నామినేషన్లు దాఖలు చేశారు. ఆరు స్థానాలకు అభ్యర్థులుగా బండా ప్రకాశ్ (banda prakash) , వెంకట్రామిరెడ్డి (venkatarami reddy), గుత్తా సుఖేందర్‌రెడ్డి , తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లను అధిష్టానం ప్రకటించగా.. వీరు నామినేషన్లు వేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం అనూహ్యంగా తెరాస అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు జరిగాయి. జాబితాలో చివరి నిమిషంలో బండా ప్రకాశ్, వెంకట్రామ్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఈ ఆరు స్థానాల్లో ఎన్నిక లాంఛనం కానుంది.
కడియం శ్రీహరి (TRS MLC Candidate)

వరంగల్ జిల్లా పర్వతగిరిలో 1952 జులై 8న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసి బ్యాంకు మేనేజర్‌గా ఆ తర్వాత అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్ పిలుపు మేరకు తెదేపాలో చేరారు. 1994లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 1999లోనూ విజయం సాధించి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2004 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2008 ఉపఎన్నికలో గెలిచారు. 2013లో కడియం తెరాసలో చేరారు. 2014లో వరంగల్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాల్లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికై ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డి (TRS MLC Candidate)

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో 1954 ఫిబ్రవరి రెండో తేదీన జన్మించారు. బీఎస్సీ చదివారు. 1981లో పంచాయతీ ఎన్నికల్లో పోటీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షునిగా, సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర పాడి ఉత్పత్తిదారుల అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్‌గా, జాతీయ పాడి ఉత్పత్తిదారుల అభివృద్ధి మండలి సంచాలకునిగా సేవలందించారు. 1999లో ఆయన తెదేపా తరఫున ఎంపీగా నల్గొండ నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్‌లో చేరి అదే స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లోనూ కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన ఆయన 2015లో తెరాసలో చేరారు. 2018లో రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2019 ఆగస్టులో ఎమ్మెల్సీ పదవి చేపట్టిన ఆయన సెప్టెంబరులో శాసనమండలి ఛైర్మన్ అయ్యారు. జూన్ మూడో తేదీన ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసింది.
బండా ప్రకాశ్ (TRS MLC Candidate)

వరంగల్‌లో 1954 ఫిబ్రవరి 18న జన్మించారు. ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. తెలంగాణలోని పలు సామాజిక, స్వచ్ఛంద సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా ఉన్నారు. వరంగల్ పురపాలక సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడైన ఆయన 2017లో తెరాసలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018 మార్చి 23న తెరాస తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.
వెంకట్రామరెడ్డి (TRS MLC Candidate)

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో 1962 సెప్టెంబరు 21న జన్మించారు. 1996లో గ్రూప్-1 అధికారిగా ఎంపికయ్యారు. బందరు, చిత్తూరు, తిరుపతిలలో ఆర్డీవోగా పనిచేశారు. 2007లో ఐఏఎస్ హోదా పొందారు. మెదక్‌లో డ్వామా పీడీగా, హుడా సెక్రటరీగా, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా పనిచేశారు. సుదీర్ఘ కాలం సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు ఆయన సర్వీసు ఉంది. సోమవారం స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.
- ASPRTC letter To TSRTC : తెలంగాణ ఆర్టీసీకి ఏపీఎస్ఆర్టీసీ లేఖ... మరిన్ని బస్సు సర్వీసులు పెంచుదాం...
పాడి కౌశిక్‌రెడ్డి (TRS MLC Candidate)

కరీంనగర్ జిల్లా వీణవంకలో 1984 డిసెంబరు 21న జన్మించారు. బీకాం చదివారు. రంజీ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడారు. 2018లో ఆయన కాంగ్రెస్‌లో చేరి, ఆ సంవత్సరం డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్‌లో పోటీ చేసి 34.60% ఓట్లను సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యదర్శి పదవిని పొందారు. ఈటల రాజేందర్ తెరాసకు రాజీనామా చేసిన తర్వాత కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరారు. హుజూరాబాద్ టికెట్‌ను ఆశించినప్పటికీ.. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.
తక్కెళ్లపల్లి రవీందర్‌రావు (TRS MLC Candidate)

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం విస్సంపల్లిలో 1964 సెప్టెంబరు 9న జన్మించారు. డిగ్రీ చదివారు. విద్యాసంస్థలను ప్రారంభించారు. 1983లో తెదేపాలో చేరి.. ఆ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో తెరాసలో చేరారు. పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఇన్‌ఛార్జిగా పనిచేశారు.
ఇవీ చూడండి: