కొవిడ్ 19 కేసుల్లో అధికశాతం వృద్ధులే ఉండటంతో 65 ఏళ్లు పైబడిన వారిని బయటకు రావద్దంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం బిడ్డలు దూరంగా వెళ్లటంతో ఒంటరిగా బతుకెళ్లదీస్తోన్న తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా మారింది. హైదరాబాద్‌లో వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వయోధికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మందడి కృష్ణారెడ్డి ఆందోళన వెలిబుచ్చారు.
ఆకలి.. అనారోగ్యం.. ఒంటరితనం
‘కుమారులు, కుమార్తెలు విదేశాల్లో స్థిరపడ్డారు. భార్యాభర్తలిద్దరూ పింఛనుతో కాలం వెళ్లదీస్తున్నారు. వైద్య సిబ్బంది రావట్లేదు. వంట మనిషిని రావద్దంటూ అపార్ట్‌మెంట్ సభ్యులు ఆదేశించారు. దీంతో నెలరోజులుగా వృద్ధ దంపతులు అర్ధాకలితో నెట్టుకొస్తున్నారు. ఇటువంటి సమయంలో మరుగుదొడ్డిలో కాలుజారి పడిన భర్తను పైకి లేపేందుకు ప్రయత్నించిన భార్య కూడా స్వల్పంగా గాయపడింది. హైదరాబాద్ మహానగరంలోని 60శాతం వృద్ధులు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో అధికశాతం వృద్ధులు ఆకలి, అనారోగ్యం, ఒంటరితనంతో బాధపడుతున్నట్లు సహాయక కేంద్రాలకు వస్తున్న ఫోన్‌కాల్స్ ద్వారా అధికారులు లెక్కగడుతున్నారు.
కష్టాలకు కారణాలెన్నో....
గ్రేటర్ పరిధిలో చాలా మంది ఆసరా, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి వచ్చే పింఛన్లపైనే ఆధారపడి ఉన్నట్టు అంచనా. వీరిలో 65 ఏళ్లు పైబడిన వారు 75శాతం వరకు పిల్లలు దూరంగా ఒంటరిగానే ఉంటున్నారు. లాక్‌డౌన్ పరిస్థితుల్లో పింఛన్ల కోత, నిధుల లేమితో కొన్ని వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద సంస్థలు వారి కడుపు నింపలేకపోతున్నాయి. కొందరికి బిడ్డల నుంచి వచ్చే డబ్బు రావడం లేదు. రీఛార్జి చేసుకునేందుకు బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో చాలా మంది వృద్ధుల సెల్‌ఫోన్లు మూగబోయాయి. ఓ సంస్థ జరిపిన సర్వే ప్రకారం మరణించిన తల్లిదండ్రుల కర్మకాండలు చేస్తున్న పిల్లలు 37శాతమే. మిగిలిన 57 శాతం మంది దూరంగా ఉన్నామనో.. రాలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ పేర్కొంటున్నారు.
పెద్దలకు కొండంత అండగా...
లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు పలు సంస్థలు సాయం అందిస్తున్నాయి.
- బాగ్‌లింగంపల్లిలోని ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు నిత్యావసరాలు సరఫరా, అత్యవసర సమయంలో వాహనాలు సమకూర్చుతున్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి టెలి మెడిసిన్ ద్వారా సలహాలు సూచనలు అందిస్తున్నట్లు సంస్థ ట్రస్టీ మందడి కృష్ణారెడ్డి తెలిపారు.
వివరాలకు: 98480 40199, 83096 34283 సంప్రదించవచ్చు.
- ఎల్డర్స్ స్ప్రింగ్ రెస్పాన్స్ టీమ్: టాటా ట్రస్టు, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న దీని ద్వారా వృద్ధులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన వారికి వసతి సౌకర్యం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు.
వివరాలకు: 14567, 1800 572 8980 (ఉదయం 8 నుంచి సాయంత్రం 7.గంటల వరకు)
మనోధైర్యమే బలం...
వృద్ధాప్యంలో సమస్యలు ఎదుర్కొనేందుకు మనోధైర్యమే బలం. వయోభార ఇబ్బందులను ఆన్‌లైన్ ద్వారా వైద్యులతో పంచుకునే అవకాశం ఉంది. మనసుకు నచ్చిన సంగీతం, పుస్తక పఠనం ఉత్తమం. ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు లభించే ఆహారం తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పసుపును భాగం చేసుకోవాలి. యోగా, ధ్యానం చేయాలి.
- డాక్టర్ హరికుమార్, మనస్తత్వనిపుణులు
ఇదీ చదవండి : పాఠశాల విద్యార్థుల ఘర్షణ.. కర్రతో ఇద్దరిపై దాడి