మంగళవారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఎండీ స్థాయి చర్చలు జరుగుతాయని రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. మార్చి 22 నుంచి తెలంగాణకు బస్సులు తిరగటం లేదని చెప్పారు. తెలంగాణతో అంతర్రాష్ట్ర ఒప్పందం కాకపోవడంతోనే బస్సులు తిప్పలేకపోతున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి లేకుండా బస్సులు తిప్పలేమని స్పష్టం చేశారు.
బస్సుల రాకపోకలకు తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు అనుమతి ఇవ్వలేదని కృష్ణబాబు వెల్లడించారు. ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ అధికారులతో సమావేశాలు జరిపామని...రూట్ వారీగా సమాన కి.మీ. తిప్పేలా ప్రాథమికంగా నిర్ణయించామని వివరించారు.
విభజన ముందు 3.43 లక్షల కి.మీ. మేర తెలంగాణలో ఏపీ బస్సులు తిప్పుతోంది. ఏపీలో తెలంగాణ రాష్ట్రం 95 వేల కిలోమీటర్లు బస్సులు తిప్పుతోంది. బస్సుల కిలోమీటర్లు తగ్గించాలని తెలంగాణ ప్రధానంగా ఇప్పుడు కోరుతోంది. ఇప్పటికే తెలంగాణకు నడిపే బస్సులను 2.65 లక్షల కి.మీ.కు తగ్గించాం. మరో 55 వేల కి.మీ. తగ్గిస్తాం, తెలంగాణను 50 వేల కి.మీ. పెంచుకోవాలని కోరాం. పెంచిన కిలోమీటర్లకు సర్వీసులు నడపలేమని తెలంగాణ అధికారులు తెలిపారు. కిలోమీటర్లు తగ్గించడం వల్ల ప్రైవేటు ట్రావెల్స్ లాభపడతాయని చెప్పాం. మంగళవారం హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీ స్థాయి చర్చలు జరుపుతారు- కృష్ణబాబు,రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి
ఒప్పందం ఆలస్యమైతే తాత్కాలిక పర్మిట్లకు అనుమతికి ప్రతిపాదన పెట్టామని కృష్ణబాబు తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య బస్సులు తిరగక ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందన్న ఆయన... పబ్లిక్, ప్రైవేటు బస్సుల్లో ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి 72 వేల కి.మీ. నడిపేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణను కోరామని వెల్లడించారు. ప్రైవేటు ట్రావెల్స్ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని...ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేసేందుకు ఆదేశాలిచ్చామని అన్నారు. వైద్యారోగ్య శాఖ అనుమతి రాగానే విజయవాడ, విశాఖలో సిటీ సర్వీసులు పునరుద్ధరిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి