Traffic Pending Challans: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. అంటే ఈనెల 15తో ఈ ఆఫర్ ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ పెండింగ్ చలాన్లు కట్టనివారు అప్రమత్తమై చలాన్లు కట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. నిజానికి ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ఎక్కువ మంది వాహనదారులు ఈ-చలాన్ సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. సర్వర్ సమస్య తలెత్తడంతో చలాన్లు కట్టెందుకు ఎక్కవ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల పెండింగ్ చలాన్ల చెల్లింపులు జరిగాయని వివరించారు. చలాన్ల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.250 కోట్ల ఆదాయం వచ్చిందని హోంమంత్రి వివరించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందున వారి విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 15 వరకు పెండింగ్ చలాన్లపై రాయితీ అవకాశాన్ని పొడిగించినట్టు హోంమంత్రి చెప్పారు. ఇప్పటివరకు చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని హోం మంత్రి సూచించారు. ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75 శాతం రాయితీ, నాలుగు చక్రాల వాహనాలకు జరిమానాలో 50శాతం రాయితీని ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు మొదటిరోజు విశేష స్పందన