ఇరు రాష్ట్రాల మధ్య నడుస్తున్న కృష్ణా జలాల వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది నీళ్ల లొల్లి కాదని... కేసీఆర్, జగన్ ఆడుతున్న సురభి నాటకమని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి డ్రామాలు ఆడుతూ... ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్రెడ్డి... ఇరు రాష్ట్రాల సీఎంలపై విరుచుకుపడ్డారు. అటు వైఎస్సార్ కుటుంబానికి సైతం పలు ప్రశ్నలు సంధించారు.
వైఎస్సార్ చివరి కోరిక అదే...
వైఎస్ రాజశేఖర్రెడ్డి అనే మహానేత.. కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని తెలిపారు. తన తండ్రి పేరు ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ పార్టే చేర్చిందంటున్న షర్మిలకు... ఎఫ్ఐఆర్లను రాజకీయ పార్టీలు నమోదు చేయవని తెలియదా అని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి ద్వారా జగన్ మోహన్ రెడ్డి లబ్ది పొందాడని అప్పట్లోనే కొద్ది మంది కేసులు వేశారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ కారణమని ఆరోజు ఆందోళనలు చేసి.. ఇప్పుడు ఆ సంస్థ వ్యక్తికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వైఎస్సార్ కుటుంబం... రిలయన్స్ సంస్థకు చెందిన వ్యక్తికి ఎందుకు ఎంపీ అవకాశం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే వైఎస్సార్ చివరి కోరిక అని.. తండ్రి మీద ప్రేముంటే దాన్ని నెరవేర్చేందుకు ఆ కుటుంబం కృషి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: