WEATHER IN AP : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు అయ్యే అవకాశముందని తెలిపింది. ప్రత్యేకించి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.
బాపట్లలో జలమయమైన రహదారులు : బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి రేపల్లె పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. బస్టాండ్ సెంటర్, తాలూకా సెంటర్, మున్సిపాల్టీ కార్యాలయం రోడ్లు.. నీట మునిగిపోయాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్ష ప్రభావంతో పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని.. బాపట్ల, భట్టిప్రోలు, అమృతలూరు, నిజాంపట్నం, వేమూరులోనూ వర్షం పడుతోంది. వర్షం కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పత్తి, మిర్చి పంటలు పూత దశకు వచ్చిన సమయంలో కురుస్తున్న వర్షంఅన్నదాతలు ఆందోళన రేపుతోంది.
విజయవాడలో వర్షం కారణంగా దుర్గామల్లేశ్వరస్వామి వారి తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. వర్షం వల్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించలేమని వైదిక కమిటీ తెలిపింది. వర్షంలో ఉత్సవమూర్తులను బయటకు తీయకూడదని అర్చకులు తెలిపారు. మహామండపంలోనే కొబ్బరికాయ కొట్టి హారతులు ఇవ్వాలని నిర్ణయించారు. 20 ఏళ్ల క్రితం ఇలాగే ప్రక్రియ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
గుంటూరులో విస్తారంగా వర్షాలు : ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల రహదారులు నీట మునిగాయి. వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. నగరంలోని మూడు వంతెనల వద్ద వర్షపు నీరు నిలిచిపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వంశధార కాలువకు గండిపడి.. వజ్రపుకొత్తూరు మండలం గుల్లలపాడు, తడివాడ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. పలాస మండలం వరహాల గెడ్డలో పడి కేదారిపురం గ్రామానికి చెందిన పి శంకర్, బి. కూర్మారావులు గల్లంతయ్యారు.
ఇవీ చదవండి: