Vaikunta Dwara Darshanam at tirumala: ముక్కోటి ఏకాదశి సందర్బంగా ఈ నెల 13 నుంచి పది రోజులపాటు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వైకుంఠద్వార దర్శనంలో సామాన్య భక్తులకు ఎక్కువ సమయం దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అందువల్ల పది రోజుల పాటు సిఫార్సు లేఖలు తీసుకోబడవన్నారు. ప్రముఖులు స్వయంగా వస్తేనే టిక్కెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. మరమ్మతులు జరుగుతున్నందున తిరుమలలో గదుల కొరత ఉందని.. ప్రజాప్రతినిధులకు నందకం, వకుళామాత వసతి సముదాయాల్లో గదులు కేటాయిస్తామన్నారు.
గదులు సరిపోకపోతే తిరుపతిలో వసతి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లు పొందిన భక్తులు తిరుపతిలోని తితిదే వసతి సముదాయాల్లోనే గదులు పొందాలన్నారు.
"వైకుంఠద్వార దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోం. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు. వీఐపీలకు నందకం, వకుళామాత వసతి భవనంలో గదులు ఉంటాయి. గదులు సరిపోకపోతే తిరుపతిలో వసతి ఏర్పాటు చేసుకోవాలి. మరమ్మతుల వల్ల తిరుమలలో గదుల కొరత ఏర్పడింది. శ్రీవాణి ట్రస్టు టికెట్లు గలవారు తిరుపతిలో గదులు తీసుకోవాలి" - వైవీ సుబ్బారెడ్డి ,తితిదే ఛైర్మన్
అన్నమయ్య మార్గాన్ని పరిశీలించిన తితిదే చైర్మన్..
annamayya road to tirumala: అన్నమయ్య మార్గాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. కడప జిల్లా మామండూరు నుంచి తిరుమలలోని పార్వేట మండపం వరకు రహదారి నిర్మించేందుకు డీపీఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుమార్గంతోపాటు.. నడక మార్గాన్ని 15 అడుగులతో నిర్మించేలా నివేదిక రూపొందించాలన్నారు. 23 కిలో మీటర్ల దూరంపాటు రోడ్డు నిర్మించేందుకు అనుమతులు కోరుతూ అటవీ శాఖకు నివేదిక పంపాలని చెప్పారు. అనుమతులు వచ్చిన వెంటనే రహదారి నిర్మిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి:
పది రూపాయల కోడిపిల్లకు రూ.50 టికెట్- ఆర్టీసీ కండక్టర్ ఘనకార్యం!