ఉత్తరాంధ్రలో నాగావళి నదిపై విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ప్రయోజనం కల్పించేలా తోటపల్లి బ్యారేజీ నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 64వేల ఎకరాల స్థిరీకరణ, 1,31,224 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం లక్ష్యాలు. అవి ఇంకా పూర్తిగా నెరవేరలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు రెండు ప్యాకేజీల్లో పనులు జరుగుతుండగానే జల వనరులశాఖ వాటిని రద్దు పద్దులో చేర్చింది. గుత్తేదారులతో పరస్పర అంగీకార ప్రాతిపదికన రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులూ వెలువడ్డాయి.
20% పనులు మిగిలే ఉన్నాయి
తోటపల్లి బ్యారేజీ నిర్మాణం పూర్తయి నీళ్లిస్తున్నా ప్రాజెక్టులో ఇంకా 20% పైగా పనులు మిగిలే ఉన్నాయి. ఈ ప్రాజెక్టును రూ.1,127.58 కోట్లతో చేపట్టగా.. ఇప్పటివరకూ రూ.800 కోట్ల పనులే చేశారు.
* ఒకటో ప్యాకేజీలో అదనపు ఆయకట్టుకు నీరిచ్చేలా అదనపు డిస్ట్రిబ్యూటరీలు, కుడి ప్రధాన కాలువకు స్లూయిస్‌ల ఏర్పాటు వంటివి చేయాలి.
* ప్రధాన కాలువలో డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లు, ఫీల్డు ఛానళ్ల పనులు చేయాలి.
* మరో ప్యాకేజీలో తోటపల్లి కుడి కాలువ 97.7వ కిలోమీటరు నుంచి గజపతినగరం బ్రాంచి కాలువ ద్వారా నీళ్లు తీసుకెళ్లే పనులు, గడిగడ్డ దాటిన తర్వాత 15వేల ఎకరాలకు నీరందించే పనులు చేయాలి.
* డిస్ట్రిబ్యూటరీ పనులకు ఇంకా 293 ఎకరాల భూమి సేకరించాలి.
* జలాశయంలో+105 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేలా పునరావాస పనులు చేయాలి.
* శ్రీకాకుళం జిల్లాలో 161ఎకరాలు, విజయనగరం జిల్లాలో 90.47ఎకరాలు సేకరించాలి.
* భూసేకరణపై న్యాయస్థానాల్లో రెండు కేసులు పెండింగులోఉన్నాయి. ఈ కారణాలతో పనులు ఆలస్యం అవుతుండటంవల్ల ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు జల వనరులశాఖ చెబుతున్నా.. మళ్లీ పట్టాలెక్కాలంటే ఎన్నేళ్లు పడుతుందో, అప్పటికి అంచనాలు ఎంత పెరిగిపోతాయో అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఇదీ చదవండి: