అమూల్ సంస్థ ద్వారా పాలసేకరణ కోసం రూ.1,267.23కోట్ల వ్యయంతో రాష్ట్రంలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల (బీఎంసీయూ)ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలన పరమైన అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా తొలిదశలో 7,942 కేంద్రాలు నిర్మిస్తారు. నిర్మాణ బాధ్యతను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించింది. జాతీయ ఉపాధి హామీ పథకం ‘నరేగా’ ద్వారా 90 శాతం, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా 10 శాతం నిధులను సమకూర్చుకోవాలని సూచించింది. రైతు భరోసా కేంద్రాల పక్కన ఐదు సెంట్ల భూమిని అప్పగించాలని రెవెన్యూ శాఖను కోరింది.
ఇప్పటికే అమూల్ సంస్థ ప్రయోగాత్మకంగా చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాలసేకరణ చేపట్టగా భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే సంకల్పంతో ఈ నిర్మాణాలు చేపట్టనుంది. రాష్ట్రంలో రూ.1,520.19కోట్లతో మొత్తం 9,542 కేంద్రాల నిర్మాణానికి సాంకేతికపరమైన అనుమతులు ఇవ్వగా ఇందులో ఇప్పుడు మొదటి దశలో 7,942 కేంద్రాల పనులు ప్రారంభించడానికి రూ.1,267.23 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో కేంద్రానికి సగటున రూ.15.40 లక్షలు వ్యయం అవుతుంది.