cabinet Meeting : సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటి అయ్యింది. 35 అజెండా అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ చట్ట సవరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించింది. నిజాంపట్నం, మచిలీపట్నం.. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణానికి అవసరమైన 1234 కోట్ల వ్యయ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి కావాల్సిన రూ. 8,741 కోట్ల రుణ సమీకరణ అవసమైన గ్యారంటీని ప్రభుత్వం ఏపీ మారిటైమ్ బోర్డుకు ఇచ్చేందుకు... కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈనెల 27 నుంచి బెంగుళూరు-–కడప, విశాఖ-కడప మధ్య వారానికి మూడు విమాన సర్వీసులు నడిపేందుకు.. ఇండిగో విమానయాన సంస్థతో... ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ ఒప్పందం చేసుకునేందుకు అంగీకారం తెలిపింది. సర్వీసులు మొదలైన తర్వాతవయబులిటీ గ్యాప్ కింద ఏడాదికి రూ.15 కోట్ల రూపాయలు అందించనుంది. ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ డిప్యూటీ కలెక్టర్ నియామక ప్రతిపాదనలకూ... మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే.. ముసాయిదా బిల్లు సహా పలు తీర్మానాలను ఆమోదించింది.
మే నుంచి అందరూ రోడ్ల మీదకు రావాలి...
మంత్రివర్గ సమావేశంలో.. పలు అంశాలను సీఎం సహచరులతో ప్రస్తావించినట్లు తెలిసింది. ఇకపై పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలను చేపట్టాలని... మే నుంచి అందరూ రోడ్ల మీదకు రావాలని.. ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ సహచరులకు స్పష్టంచేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలందరికీ చేరువ కావాలని స్పష్టం చేసినట్లు సమాచారం. మంత్రులంతా వారానికి 3 రోజులకు తగ్గకుండా పార్టీకి సమయం కేటాయించాలన్న జగన్.. వచ్చే రెండేళ్లలో ఏమేం చేద్దాం? ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్దాం అనేది... అతి త్వరలో శాసనసభాపక్ష సమావేశంలో దిశా నిర్దేశం చేసుకుందామని అన్నట్లు తెలిసింది.
జూలై 8న పార్టీ ప్లీనరీ..
జూలైలో... పార్టీ ప్లీనరీ నిర్వహించుకుందామని, అప్పటికే మనం ప్రజల్లోకి వెళ్లాలని మంత్రివర్గ సహచరులకు చెప్పారని సమాచారం. అభివృద్ధి పనులు చాలా కాలంగా పెండింగులో ఉన్నాయని.. కొంతమంది మంత్రులు ప్రస్తావించగా ... ‘దానికి పరిష్కారంగానే నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున అభివృద్ధి నిధులు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం’అని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని గ్రామాలన్నింటినీ సందర్శించాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ నెల 10న వైకాపా శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా పార్టీ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది. జులై 8న పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు వైకాపా వర్గాలసమాచారం.
ఇదీ చదవండి : Achennaidu :' రాజధాని హైదరాబాదే అయితే... వెళ్లిపోమనండి..'