ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణిస్తున్నారా? సహచర ప్రయాణికుల్లో ఒక కొవిడ్ బాధితుడు ఉంటే వారి నుంచి వైరస్ వ్యాపించే ముప్పు ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఆటో, బస్సు, నాన్ ఏసీ కారు, ఏసీ కారు... ఈ నాలుగింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు... మిగతా వాటి కంటే ఆటో ప్రయాణంలోనే వైరస్ వ్యాప్తి ముప్పు తక్కువ ఉంటుందని అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన బ్లూమ్ బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు తేల్చారు.
పర్యావరణ ఆరోగ్యం, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన దర్పణ్ దాస్, గురుమూర్తి రామచంద్రన్.. ‘కొవిడ్-19 మహమ్మారి వేళ భారత్‌లో వివిధ రవాణా వాహనాల్లో ప్రయాణ.. ప్రమాద విశ్లేషణ’ పేరిట ఇటీవల ఓ అధ్యయనం చేశారు. వారి పరిశోధన పత్రం ‘ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్’ జర్నల్‌లో ప్రచురితమైంది. సహ ప్రయాణికుల్లో ఒక కొవిడ్ రోగి ఉంటే ఆటోలో వెళ్లేటప్పటి కంటే ఏసీ కారులో ప్రయాణించేటప్పుడు వైరస్ బారిన పడే ముప్పు 300 రెట్లు అధికంగా ఉంటుందని వీరి అధ్యయనంలో తేలింది.
అధ్యయనం ఇలా?
* పరిశీలించిన వాహనాలు: ఆటో, నాన్ ఏసీ కారు, ఏసీ కారు, బస్సు
* ఏ వాహనంలో ఎంతమంది: ఆటో, నాన్ ఏసీ కారు, ఏసీ కార్లలో ఐదేసి మంది చొప్పున, బస్సులో 40 మంది (డ్రైవర్‌తో కలిపి)
* వ్యాప్తి ఎవరి ద్వారా: ఆయా వాహనాల్లో ఒక కొవిడ్ బాధితుడు ఉన్నారనుకుంటే...
* అనుసరించిన విధానం: గాలిద్వారా సాంక్రమిక వ్యాధుల వ్యాప్తిని అంచనావేసేందుకు ఉపయోగించే వెల్స్-రిలే నమూనా.
ఏసీ కారులో 300 రెట్లు ముప్పు
* కొవిడ్ రోగితో కలిసి ఆటోలో ప్రయాణించేటప్పటి కంటే నాన్ ఏసీ కారులో వెళ్లేటప్పుడు అతని ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాద ముప్పు 86 రెట్లు అధికం. ఏసీ కారులో ఈ ముప్పు 300 రెట్లు ఎక్కువ.
* నాన్ ఏసీ కారులో ప్రయాణించేటప్పుడు అద్దాలు కిందకు దించేసి.. బయట గాలి లోపలికి వచ్చేలా చేస్తే.. ఏసీ కారులో ప్రయాణం కంటే ప్రమాద ముప్పు 250 శాతం మేర తగ్గుతుంది.
* ఆటోలో నలుగురు ప్రయాణికులతో కలిసి వెళ్లేటప్పటి ముప్పుతో పోలిస్తే.. కదలకుండా ఆగి ఉన్న బస్సులో కిటికీలన్నీ తెరిచి ఉంచి.. అందులో 40 మంది ప్రయాణికులు కూర్చొన్నప్పుడు వైరస్ వ్యాపించే ప్రమాద ముప్పు 72 రెట్లు అధికం.
ఎందుకు? ఎలా?
* ఆటోలో బయట నుంచి వచ్చే వెంటిలేషన్ ఎక్కువ. ప్రతి గంటకూ గాలి మారే రేటు (ఎయిర్ ఎక్ఛేంజ్ పర్ అవర్) చాలా అధికం. అందుకే వైరస్ వ్యాప్తి ముప్పు తక్కువగా ఉంటోంది.
* నాన్ ఏసీ కారులో వెళ్లేటప్పుడు బయట నుంచి వచ్చే గాలి కోసం అద్దాలు కిందకు దించేస్తారు. దాని ద్వారా వెంటిలేషన్ పెరిగి వ్యాప్తి ముప్పు కొంత తగ్గుతుంది.
* ఏసీ కారులో ప్రయాణించేటప్పుడు.. అద్దాలన్నీ మూస్తారు. కొవిడ్ బాధితుడి నుంచి వెలువడే డ్రాప్‌లెట్స్ బయటకు వెళ్లే అవకాశం తక్కువ. అందుకే సహచర ప్రయాణికులకు వ్యాప్తి ముప్పు మిగతా వాహనాలతో పోలిస్తే ఈ వాహనంలో ఎక్కువ.
* వాహనాల్లో వెంటిలేషన్ ఎంత ఎక్కువగా ఉంటే.. వైరస్ వ్యాప్తి ముప్పు అంత తక్కువ. ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకూ అద్దాలు దించేయటమే మేలు.
ఇదీ చదవండి:
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు: ఆనందయ్య