రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు కరోనా కారణంగా పెండింగులో పెట్టిన డీఏల్లో ఒకటి చెల్లించేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. 2018 జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యం 2021 జనవరి నుంచి నగదు రూపంలో ఇచ్చేందుకు కిందటి ఏడాది నవంబరు 4న ఉత్తర్వులు ఇచ్చింది. మూల వేతనంపై 3.144శాతం ఇచ్చేందుకు ఆదేశించింది. ఆ మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో 10నెలల బకాయిల చొప్పున ఇవ్వాల్సి ఉంది. 30 నెలల బకాయిలు ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాల్లో, విశ్రాంత ఉద్యోగులకు మూడు సమాన విడతల్లో ఇచ్చేందుకు నిర్ణయించింది.
రిటర్ను దాఖలు చేసుకోవాలట!
రాష్ట్రంలో దాదాపు 3.60 లక్షల మంది పింఛనర్లు ఉన్నారు. వీరికి మార్చి మొదటి వారానికే 20 నెలల బకాయి సొమ్ములు జమ కావాల్సి ఉంది. చెల్లింపుల ప్రక్రియ చేపట్టినట్లు స్లిప్పులూ వెబ్‌సైట్‌లో ఉంచారు. కానీ.. ఇప్పటికీ విశ్రాంత ఉద్యోగులకు ఆ మొత్తం దక్కలేదు. కిందటి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మళ్లీ ఆ బిల్లులు సమర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. బకాయిలు జమ కాకుండానే పన్ను రూపంలో ఆదాయం కోల్పోయాం ఇప్పుడెలా అని ప్రశ్నిస్తుండగా.. ‘రిటర్నులు దాఖలు చేసి ఆ మొత్తాలు తిరిగి పొందాలి’ అని సీఎఫ్‌ఎంఎస్ అధికారులు సూచిస్తున్నట్లు విశ్రాంత ఉద్యోగులు తెలిపారు.
ఇదీ చదవండి: