అంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నుంచి ఏళ్లతరబడి చెల్లింపులు జరగనందున.. ఇకపై వైద్య ఉపకరణాలు సరఫరా చేయవద్దని సంబంధిత తయారీ సంస్థలను అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ హెచ్చరిస్తూ శుక్రవారం రెడ్ నోటీసు జారీ చేసింది. ఏపీఎంఎస్‌ఐడీసీకి నాలుగైదు సంవత్సరాల కిందట ఉపకరణాలు సరఫరా చేసిన సంస్థలకు ఇప్పటికీ చెల్లింపులు జరగలేదని పేర్కొంది.
వంద శాతం అడ్వాన్సు అందితేనే భవిష్యత్తులో ఏపీఎంఎస్‌ఐడీసీ పిలిచే టెండర్లలో పాల్గొనాలని లేదా పంపిణీదారుల ద్వారా ఉపకరణాలు సరఫరా చేయాలని సంఘంలో భాగస్వామ్యం కలిగిన సంస్థలకు స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆర్థికంగా తలెత్తే సమస్యలకు సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ రెడ్ నోటీసును సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ అసోసియేషన్‌లో వైద్య రంగానికి సంబంధించిన ఉపకరణాలు, ఎలక్ట్రానిక్, డయాగ్నస్టిక్స్, ఇంప్లాంట్స్ వంటి వాటిని తయారుచేసే సంస్థలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.
రూ.15 కోట్ల బకాయిల వివరాలున్నాయి..
డివైజ్ ఇండస్ట్రీ నుంచి మాకు ఓ మెయిల్ వచ్చింది. అందులో.. ‘2014-2019 సంవత్సరాలకు సంబంధించి రూ.74,000, రూ.27 వేలు, రూ.9 వేలు తరహాలో స్వల్ప మొత్తాలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా నాలుగైదు సంస్థలకు రూ.15 కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉందని పేర్కొన్నారు.’ సంబంధిత సంస్థల నుంచి ఉపకరణాలు ఆలస్యంగా పంపిణీ జరిగినా, నాణ్యత లేకున్నా, సంబంధిత పత్రాలు చూపించకున్నా, నిబంధనల ప్రకారం వ్యవహరించకున్నా చెల్లింపుల్లో కోతలు అనివార్యంగా ఉంటాయి. గడిచిన రెండు సంవత్సరాల్లో కొవిడ్ అవసరాలకు కొనుగోలు చేసిన ఉపకరణాల నిమిత్తం రూ.1,800 కోట్ల వరకు చెల్లించాం. గత రెండు నెలలకు సంబంధించి రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. అసోసియేషన్ నుంచి మాకు మెయిల్ రావడంలో దురుద్దేశం కనిపిస్తోంది. దీనిపై వారికి నోటీసులు ఇస్తున్నాం. మా సంస్థకు ఉపకరణాల పంపిణీలో సంబంధిత సంస్థల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవు.
-మురళీధర్‌రెడ్డి, ఎండీ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
ఇదీ చూడండి: PADAYATRA: అమరావతి రైతుల మహా పాదయాత్రకు రేపు విరామం.. కారణమేంటంటే..?