సైదాబాద్‌లో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబానికి సంఘీభావంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అక్కడి నుంచి తరలించారు.
సింగరేణి కాలనీలో బాధిత కుటుంబసభ్యులను వై.ఎస్. షర్మిల బుధవారం పరామర్శించారు. అనంతరం నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ తన అనుచరులతో బాధితుల ఇంటివద్దే దీక్షకు దిగారు. షర్మిల దీక్షకు మద్దతు పలికేందుకు వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ సింగరేణి కాలనీకి విచ్చేసి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
బుధవారం అర్ధరాత్రి వరకు షర్మిల దీక్ష కొనసాగగా.. రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. ఈ సమయంలో వైఎస్ షర్మిల అనుచరులు, స్థానికులు పోలీసులను అడ్డుకున్నారు. వైఎస్ షర్మిలను బలవంతంగా అక్కడి నుంచి లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసానికి తరలించారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వ పెద్దలు ఎవరూ స్పందించకపోవటం, బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవటం శోచనీయమని షర్మిల అన్నారు. అరెస్టులకు తాను వెరువనని, చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తన దీక్ష కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ..disha bill: దిశ బిల్లులపై ఉత్తర, ప్రత్త్యుత్తరాలతోనే కాలయాపన !