Thallibidda Express: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు కష్టకాలం వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం బాలింతలు, శిశువులు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం ఈ వాహనాలను వినియోగిస్తోంది. బాలింతలకు ఎంతో ఉపయోగపడే ఈ వాహనాలు ఉన్నట్టుండి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా జీవీకే-ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో 270 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వీటి సేవలు కొనసాగిస్తున్నారు.
ఈ వాహనాల నిర్వహణ బాధ్యత చూస్తున్న జీవీకే సంస్థ ఒప్పంద గడువు గతంలోనే ముగిసింది. కొద్ది నెలల క్రితం పిలిచిన టెండరు ప్రకారం అరబిందో ఫౌండేషన్ ఈ వాహనాలను నడపాల్సి ఉంది. అయితే వారు బాధ్యతలు తీసుకోవడంలో జాప్యమవుతుండటంతో జీవీకే సంస్థ బాధ్యతల గడువు పొడిగిస్తున్నారు. ఆ సంస్థ చివరి కాలపరిమితి డిసెంబరు 31తో ముగిసింది. మరోవైపు అరబిందో ఫౌండేషన్ ఇంకా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల నిర్వహణ చేపట్టలేదు. ఈ వాహనాల్లో జీవీకే సంస్థ కొన్నింటిని లీజుకు తీసుకుని నిర్వహిస్తోంది. ప్రభుత్వం కాలపరిమితి పెంచకపోవడంతో ఈ వాహనాలను వెనక్కి ఇచ్చేస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులో ఉండే అవకాశం లేకుండా పోతోంది.
అరబిందో సంస్థ నిర్వహణ బాధ్యతలు తీసుకోవడానికి మరో నెల వరకు గడువు ఇచ్చామని, అంతవరకు జీవీకే సంస్థనే సేవలు కొనసాగించాలని కోరినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. లీజు వాహనాలను కొనసాగించే పరిస్థితి లేదని జీవీకే ప్రతినిధులు అంటున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఇంతవరకు 32 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు ఉంటే ఇందులో 12 వాహనాలను తిరిగి పంపేశారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 20 వాహనాలతోనే సేవలు అందిస్తామని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల జిల్లా ఇన్‌ఛార్జి నరసింహరాజు తెలిపారు.
ఇదీ చూడండి:
Farmers Huge losses: అన్నదాతల అప్పుల సాగు.. చితికిపోతున్న వారిలో 80% కౌలు రైతులే