పంచాయతీ ఎన్నికల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో చెలరేగిన ఉద్రిక్తతలు.. ఇంకా చల్లారలేదు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయడం మరింత కలకలం రేపింది. ఉదయమే పెద్దఎత్తున అచ్చెన్నాయుడి ఇంటికి చేరుకున్న పోలీసులు...ఆయన్ను అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల సందర్భంగా నిమ్మాడలో తెలుగుదేశం, వైకాపా నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదంపై కోటబొమ్మాళి పోలీసుస్టేషన్‌లో 22 మందిపై కేసు నమోదైంది. నిన్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇవాళ అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్యపరీక్షల అనంతరం అచ్చెన్నాయుడిని కోటబొమ్మాళి కోర్టుకు తరలించారు పోలీసులు. అచ్చెన్నాయుడికి ఈ నెల 15 వరకు రిమాండ్ విధించారు. ఆయనను అంపోలులోని జిల్లా జైలుకు తరలించారు.
అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కక్షసాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయన్న చంద్రబాబు.. తక్షణం అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రపై జగన్ కన్నుపడిందని.. అందుకే ఆ మూడు జిల్లాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. నిమ్మాడలో 4 దశాబ్దాలుగా ఎన్నికలు జరుగుతున్నా...ఏనాడు ఇలాంటి వాతావరణం లేదన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరని ఆయన ప్రశ్నించారు. వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్.. నిమ్మాడ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. కావాలనే వెళ్లి రెచ్చగొట్టారని చంద్రబాబు మండిపడ్డారు. భయోత్పాతం సృష్టించిన దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా.. అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసులు పెట్టడమేంటన్నారు. దీనికి తగిన మూల్యం జగన్ రెడ్డి చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే సీఎం జగన్.. తెలుగుదేశం నేతలపై దాడులు, అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని లోకేశ్ విమర్శించారు. నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్లిన వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్, అతని అనుచరుల పై పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో తెదేపా నేత శ్రీనివాసరెడ్డిని హత్య చేశారని లోకేశ్ మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా.. తెలుగుదేశం నేతలు భయపడే పరిస్థితి లేదని లోకేశ్ హెచ్చరించారు.
పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా ఎదుర్కొలేకే.. వైకాపా ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. అధికార పార్టీ నేతలు మారణాయుధాలతో ఊరిపైపడి బెదిరింపులకు పాల్పడినా.. కనీసం కేసు నమోదు చేయని పోలీసులు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడమేంటని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు.
అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్ట్‌లు జగన్ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్టగా ఆ పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి అభివర్ణించారు. తప్పుడు కేసులతో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టును ఆ పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా ఖండించారు. తక్షణమే అచ్చెన్నాయుడును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలపై ప్రభుత్వ కక్ష సాధింపులు తారా స్థాయికి చేరాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పటిష్ఠంగా అమలుచేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు. నిమ్మాడలో విజయసాయిరెడ్డికి ఏం పని అని నిలదీశారు.