తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం ఒకటో డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యువకుడి అనుమానాస్పద మృతికి కార్పొరేటర్ కారణమంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
డివిజన్‌లోని కైకొండాయిగూడెంకు చెందిన యువకుడు తేజావత్ ఆనంద్ తేజ... గత నెల 16న ఒకటో డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ ఇంట్లో పనికి వెళ్లాడు. పనిచేస్తూనే అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. యువకుడి మృతికి కార్పొరేటరే కారణమంటూ... బంధువులు, గ్రామస్థులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్.... గుప్తనిధుల కోసం తన ఇంట్లో తవ్వకాలు చేపట్టి.. తమ బిడ్డను బలిచ్చారని కుటుంబీకులు ఆరోపించారు. అప్పటినుంచి యువకుడి బంధువులతో కార్పొరేటర్ రామ్మూర్తినాయక్ బేరసారాలు సాగిస్తున్నాడు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా..... ఇవాళ తన డివిజన్ పరిధిలోని కైకొండాయిగూడెంకు కార్పొరేటర్ రాగానే.. బంధువులు, కుటుంబ సభ్యులు ఆయనను నిలదీశారు. బాధితులతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహించిన గ్రామస్థులు కార్పొరేటర్‌పై దాడికి పాల్పడ్డారు.
ఒక్కసారిగా గ్రామస్థులంతా మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నించడం వల్ల ప్రభుత్వ పాఠశాల గదిలోకి వెళ్లి కార్పొరేటర్ తలదాచుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పోలీసు వాహనంలో కార్పొరేటర్‌ను అక్కడినుంచి తీసుకెళ్తుండగా కోపోద్రిక్తులైన గ్రామస్థులు... మరోసారి దాడికి దిగారు. వారందరినీ పోలీసులు చెదరగొట్టి కార్పొరేటర్‌ను అక్కడినుంచి తరలించారు. ఇదే సమయంలో కార్పొరేటర్ వాహనాన్ని తరలిస్తుండగా అడ్డుకుని పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ మంటల్లో కార్పొరేటర్‌కు చెందిన ఫార్చునర్ వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ఇదీ చదవండి: