WEATHER: కోస్తాలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 3.8 డిగ్రీల వరకు అధికంగా, అటు రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిశాయి. మరో రెండురోజుల పాటు కోస్తాలో వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది. గరిష్ఠంగా 46 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.
ఏలూరులో 45.85 డిగ్రీలు
శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లా కామవరపు కోటలో 45.85 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం నుంచి తూర్పుగోదావరి వరకు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ 40 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గన్నవరంలో 3.8 డిగ్రీలు, నందిగామలో 3.4, కాకినాడలో 3.3, తునిలో 2.3 డిగ్రీల మేర పెరిగాయి. అనంతపురం, కడప, కళింగపట్నం ప్రాంతాల్లో సాధారణం కంటే కాస్త తగ్గాయి. తూర్పు గోదావరి, ఏలూరు, కోనసీమ, పల్నాడు ప్రకాశం జిల్లాల్లో వేడిగాలుల తాకిడి తీవ్రంగా ఉంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా అనంతపురం జిల్లా కొలగానహళ్లిలో 92.5 మి.మీ. వర్షం కురిసింది. రాయలసీమలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి జల్లులు కురిశాయి. ఆదోని 72.0, అనంతపురం జిల్లా వజ్రకరూరు, గార్లదిన్నె, గుత్తి, విడపనకల్లు, పామిడి, డి.హీరేహాళ్, తాడిపత్రి, పెద్దవడుగూరు, ప్రకాశం జిల్లా దోర్నాల, కర్నూలు జిల్లా ఆలూరు తదితర ప్రాంతాల్లో 4 సెం.మీ. నుంచి 6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి.
ఇవీ చదవండి: