తెల్లారింది మొదలు సూరీడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 43 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. శుక్రవారం గరిష్ఠంగా గ్రేటర్‌లో 43 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం.
కనిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలు నమోదైంది. ఇది కూడా సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం. ఒక డిగ్రీ పెరిగితేనే తట్టుకోలేం అలాంటిది 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండటంతో ఎండలకు జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇళ్లకే పరిమితమైనా కాంక్రీట్ భవనాలైన ఇళ్లలో మరింత వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వంటింట్లోకి వెళ్లాలంటేనే..
ఉదయం 6 నుంచి 9 గంటల వరకు గృహిణులు వంటింట్లో పనిచేస్తుంటారు. 7 గంటల నుంచే వేడి తీవ్రత మొదలవటంతో వంటింట్లో మహిళలు వేడికి తట్టుకోలేకపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు స్టవ్ మంట వేడి తోడవటంతో వంటిల్లు నిప్పుల కుంపటిగా మారుతోంది. ఇరుకు వంటగదుల్లో గాలి ఆడక, అధిక వేడికి మహిళలు అనారోగ్యం బారినపడుతున్నారు.
- ఇదీ చూడండి: 90 శాతం హామీల అమలు దిశగా అడుగులు: సీఎం