NIRF Rankings: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)-2022 ర్యాంకుల్లో తెలుగురాష్ట్రాల విద్యాసంస్థలు వెనుకబడ్డాయి. దేశవ్యాప్తంగా అన్నిరకాల విద్యాసంస్థలకు కలిపి ప్రకటించిన ఓవరాల్ ర్యాంకుల్లో మద్రాస్ ఐఐటీ మొదటిస్థానం, బెంగుళూరు ఐఐఎస్‌సీ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బాంబే, దిల్లీ, కాన్పుర్, ఖరగ్‌పుర్, రూర్కీ, గువాహటి ఐఐటీలకు 3 నుంచి 8 వరకు ర్యాంకులు వచ్చాయి. 9, 10 ర్యాంకులు దిల్లీ ఎయిమ్స్, దిల్లీ జేఎన్‌యూలకు వచ్చాయి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ శుక్రవారం ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులను విడుదల చేశారు. యూనివర్సిటీల విభాగంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 10, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో హైదరాబాద్ ఐఐటీ 9వ స్థానంలో నిలిచాయి. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపెర్) రెండో ర్యాంకును చేజిక్కించుకొంది. దేశంలోని టాప్-10 కాలేజీల్లో అయిదు దిల్లీవే.
ఆర్కిటెక్చర్, న్యాయవిద్య(లా)లో వేర్వేరుగా ప్రకటించిన టాప్-10లో తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ ఏడో స్థానం, హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నాలుగో స్థానంలో నిలిచాయి. మెడికల్, డెంటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టాప్-10 ర్యాంకుల్లో తెలుగువెలుగు కనిపించలేదు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో తెలుగురాష్ట్రాలది రాశి ఎక్కువ, వాసి తక్కువలా కనిపించింది.
టాప్-10లో నిలిచినవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలే. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటురంగంలోని ఇతర సంస్థలేవీ టాప్-10లో లేవు. వైద్యవిభాగంలో టాప్-50లో తెలుగురాష్ట్రాల్లోని ఏ సంస్థకూ స్థానం దక్కలేదు. ఇంజినీరింగ్, ఫార్మసీ మినహా మిగిలిన అన్ని విభాగాల్లోనూ తెలుగురాష్ట్రాల్లోని విద్యాసంస్థల సంఖ్య తక్కువగానే కనిపించింది.
ప్రాభవం కోల్పోతున్న ఏపీ సంస్థలు.. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో ఏపీ విద్యాసంస్థలు క్రమంగా ప్రాభావం కోల్పోతున్నాయి. ఓవరాల్ ర్యాంకుల్లో 2019లో 29వ స్థానంలో నిలిచిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రస్తుతం 71వ స్థానం దక్కింది. శ్రీవేంకటేశ్వర వర్సిటీకి 100లోపు ర్యాంకే రాలేదు. ఎలాంటి ర్యాంకూ ఇవ్వకుండా 101-150 మధ్య అని ఇచ్చారు. విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో 2019లో 16వ స్థానంలో ఉన్న ఏయూ 2022కు వచ్చేసరికి 36కు వెళ్లిపోయింది.
శ్రీవేంకటేశ్వర వర్సిటీకి గతేడాది 54వ ర్యాంకు దక్కగా.. ప్రస్తుతం 67కు పడిపోయింది. ఇంజినీరింగ్‌లోనూ ప్రభుత్వ కళాశాలల పనితీరు అధ్వానంగా ఉంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు గతేడాది 74వ ర్యాంకు దక్కగా.. ఈసారి 77తో సరిపెట్టుకుంది. 2019లో 89వ ర్యాంకులో నిలిచిన శ్రీవేంకటేశ్వర వర్సిటీ ఈసారి మొదటి 200 స్థానాల్లోనూ లేదు. జేఎన్‌టీయూల్లోని ఇంజినీరింగ్ కళాశాలలకు దారుణమైన ర్యాంకులు లభించాయి.
కాకినాడ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలకు 2019లో 103వ ర్యాంకు లభించగా.. ఈసారి 201-250 మధ్యలో నిలిచింది. జేఎన్‌టీయూ అనంతపురం కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ 2019, 2020ల్లో 185వ ర్యాంకులో ఉండగా.. గతేడాది అసలు ఏ ర్యాంకూ దక్కలేదు. ఈసారి 201-250 మధ్య ర్యాంకు కేటాయించారు.
‘విజ్ఞాన్’కు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో 95వ ర్యాంకు.. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్’ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) విడుదల చేసిన ర్యాంకుల్లో గుంటూరు జిల్లా వడ్లమూడి వద్దనున్న ‘విజ్ఞాన్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ’కి జాతీయస్థాయిలో 95వ ర్యాంకు వచ్చినట్లు ఉపకులపతి పి.నాగభూషణ్ శుక్రవారం తెలిపారు. వర్సిటీ పనితీరును కేంద్ర ఉన్నతాధికారుల బృందం పరిశీలించి, ఈ ర్యాంకు కేటాయించిందన్నారు.
ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు ఏజెన్సీల నుంచి నిధులు అందుతాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పరిశోధనలను ప్రోత్సహించడం వల్లే జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకును సాధించామని ఆయన చెప్పారు. ఇందుకు కృషిచేసిన అధ్యాపకులను విజ్ఞాన్ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేకంగా అభినందించారు.