Omicron in Telangana: భాగ్యనగరంలో ఒమిక్రాన్ అలజడి మొదలైంది. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో యుద్ధప్రాతిపదికన గచ్చిబౌలిలోని టిమ్స్‌కు పంపించారు. జినోమ్ సీక్వెన్స్ కోసం నమూనాలు ల్యాబ్‌కు పంపారు. ఆమెకు ఒమిక్రాన్ అని తేలితే నగరంలో కొన్ని ఆంక్షలు విధించాలని సర్కార్ ఆలోచిస్తోంది. ఆమెను కలిసిన వారిని గుర్తించే పనిని వైద్య ఆరోగ్య శాఖ చేపట్టింది.
Omicron in Hyderabad : వారం క్రితం వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు 50 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల నుంచి వీటి సంఖ్య పెరిగి వందకు చేరింది. దీన్నిబట్టి వైరస్ మళ్లీ ప్రభావం చూపిస్తోందని అర్థమవుతోందని అధికారులు చెబుతున్నారు. పటాన్‌చెరులోని ఓ పాఠశాలలో 25 మంది విద్యార్థులు కొవిడ్ బారిన పడినట్లు గురువారం వెలుగుచూసింది. పాఠశాలల్లో తొలుత బెంచికి ఇద్దరు విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టగా, ఇప్పుడు నలుగురైదుగురిని కూర్చోబెట్టడమే కాకుండా మాస్కులనూ పట్టించుకోవడంలేదు. ఇదే స్కూళ్లలో కరోనా కేసులు పెరగడానికి కారణమవుతోంది. బహిరంగ ప్రదేశాల్లోనూ గుంపులుగా తిరుగుతూ మాస్కులు ధరించడం లేదు. పొరుగు రాష్ట్రంలోని బెంగళూరులో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. శంషాబాద్ విమానాశ్రయానికి రోజూ 5 వేల మంది వరకు విదేశాల నుంచి వస్తుంటారు. ప్రస్తుతానికి బ్రిటన్ నుంచి వస్తున్న వారికే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ఎక్కువ శాతం గల్ఫ్ దేశాల నుంచి వస్తుంటారు. వారంతా ఈ పరీక్షలు చేయించుకుని వస్తుండడంతో 2 శాతం మందినే ర్యాండమ్‌గా పరీక్షిస్తున్నారు. వారం రోజులుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారిని పరిశీలించనున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే ఆంక్షలే!
Omicron New Variant : నగరంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశిస్తే పరిమిత ఆంక్షలు విధించాలని సర్కార్ యోచిస్తోంది. కేసుల సంఖ్య పెరిగితే మళ్లీ ఆన్‌లైన్ క్లాసులకే మొగ్గు చూపనున్నట్లు విద్యాశాఖ అధికారి ‘ఈనాడు, ఈటీవీ భారత్’కు తెలిపారు. వారం రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.
టీకాలపై ప్రధానంగా దృష్టి
Corona Vaccination : గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఇప్పటికీ టీకా తొలి డోసు వేయించుకోని వారు 10 లక్షల మంది పైనే ఉన్నారు. రెండో డోసు వేయించుకోని వారి సంఖ్య 26,31,945 మంది. ఒమిక్రాన్ అలజడి నేపథ్యంలో రెండో డోసు వేయించుకోని వారి ఇళ్లకు వెళ్లి ఒప్పటించి టీకాలు వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరుకు 90 శాతం లక్ష్యం సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఆదేశించారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో 750 టీకా కేంద్రాలున్నాయి. రెండు రోజులుగా పలువురు టీకాలు వేయించుకోవడానికి పరుగులు పెడుతున్నారు.
ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు!
Corona Cases in Telangana : గాంధీలో 1800 పడకలున్నాయి. ప్రస్తుతం కరోనా రోగులకు 120 మాత్రమే కేటాయించి మిగిలినవి సాధారణ రోగులకు కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ 35 మంది మహమ్మారి బాధితులున్నారు. ఒమిక్రాన్ బాధితులు పెరిగితే ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పడకల సంఖ్య పెంచుతామని నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
టిమ్స్‌లో 1200 పడకలున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో సాధారణ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం టిమ్స్‌లో 25 మంది కరోనా బాధితులున్నారు. తెలంగాణలో ఒమిక్రాన్ బాధితులు పెరిగితే తొలి దశలో ఇక్కడే చికిత్స అందజేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.