'ఆపరేషన్ కోసం దాచుకున్న 2 లక్షలు ఎలుకలు కొట్టేశాయి!' ఈటీవీభారత్ కథనాని(Etv Bharat Effect)కి తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. ఎలుకలు కొరకడం వల్ల రూ.2 లక్షలు నష్టపోయిన రైతు రెడ్యాకు సాయం చేస్తానని ముందుకొచ్చారు. అంతేకాకుండా అతడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
' తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా ఇందిరానగర్ తండాకు చెందిన రైతు రెడ్యా తన వైద్యం కోసం బీరువాలో రూ.2 లక్షలు దాచుకున్నాడు. అవి ఎలుకలు కొట్టేశాయని.. ఈటీవీభారత్ ద్వారా నా దృష్టికి వచ్చింది. ఆ రైతుకు తను నష్టపోయిన డబ్బును నేను అందిస్తాను. అంతేకాకుండా.. రెడ్యాకు మెరుగైన వైద్యం అందేలా చూస్తాను. ఈ కథనాన్ని నా దృష్టికి తీసుకువచ్చిన ఈటీవీ భారత్కు కృతజ్ఞతలు. కేసీఆర్ హయాంలో ఏ విధంగానైనా రైతు నష్టపోకుండా చూస్తాం. కర్షకులకు అండగా నిలవడమే తెరాస సర్కార్ ధ్యేయం.'
- సత్యవతి రాఠోడ్, రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి
అసలు ఏం జరిగిందంటే...
మహబూబాబాద్ మండలం వేంనూర్ శివారు ఇందిరానగర్ తండాకు చెందిన రెడ్యా.. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రికి వెళ్లాడు. రెడ్యాను పరిశీలించిన వైద్యులు.. అతడి కడుపులో కణతి ఏర్పడిందని.. దాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. దానికోసం దాదాపు రూ.4 లక్షల ఖర్చవుతుందని తెలిపారు. కూరగాయలు అమ్ముతూ కొంత.. అప్పుచేసి మరికొంత డబ్బు కూడబెట్టాడు. రూ.2 లక్షల రూపాయలు బీరువాలో దాచాడు. ఆస్పత్రికి వెళ్దామని డబ్బు తీసి చూస్తే.. ఆ నోట్లన్ని ఎలుకలు కొట్టి ఉన్నాయి. లబోదిబోమన్న రైతు.. ఏం చేయాలో అర్థం గాక కన్నీటి పర్యంతమయ్యాడు. స్థానికుల సాయంతో.. బ్యాంకుల చుట్టూ తిరిగాడు. అన్ని బ్యాంకులు ఆ నోట్లు చెల్లవని చెప్పడంతో దిగులుచెందాడు. తనకెలాగైనా సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.
'ఈ విషయంపై ఈటీవీభారత్ (Etv Bharat Effect) 'ఆపరేషన్ కోసం దాచుకున్న రూ. 2 లక్షలు ఎలుకలు కొట్టేశాయి!' పేరుతో కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందిన మంత్రి.. రైతుకు డబ్బు, వైద్యం అందేలా సాయం చేస్తానని హామీ ఇచ్చారు.'
- రెడ్యా, బాధితుడు
తన గోడును మంత్రి దాకా తీసుకువెళ్లిన ఈటీవీభారత్(Etv Bharat Effect)కు రైతు రెడ్యా కృతజ్ఞతలు తెలిపారు. తనకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన మంత్రి సత్యవతికి ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్ హయాంలో రైతుకు నష్టం చేకూరదనే మాట నిజం చేస్తున్నారని పేర్కొన్నారు.
- సంబంధిత కథనం : రూ. 2 లక్షలు.. అన్యాయంగా ఎలుకల పాలు!