DH Srinivas on Covid Third Wave: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూచనలను ప్రజలంతా పాటించాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు కోరారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఇంటా, బయటా మాస్కు ధరించాలని సూచించారు. భౌతికదూరం పాటించాలని చెప్పారు. టీకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని అన్నారు. 2 కోట్ల కొవిడ్ పరీక్షల కిట్లను సిద్ధంగా ఉంచామని డీహెచ్ వెల్లడించారు.
అప్పటి నుంచే పెరిగాయ్..
DH Srinivas on Corona Third Wave: "తెలంగాణలో జనవరి 1 నుంచి కేసులు పెరిగాయి. కేసుల పెరుగుదలను ముందుగానే గుర్తించాం. కరోనా పరిస్థితులపై రోజూ సమీక్ష చేస్తున్నాం. రాష్ట్రంలో గత 5 రోజుల్లో 4 రెట్లకు పైగా పెరిగింది. పాజిటివ్ రేట్ కూడా 3శాతంపైగా ఉంది. వేలల్లో కేసులు నమోదవుతున్నా.. తీవ్ర ప్రభావం లేదు. ఆస్పత్రుల్లో ఎక్కడా ఎక్కువ సంఖ్యలో రోగులు చేరడం లేదు. ఒమిక్రాన్ బారిన పడిన వారు 5 రోజుల్లోనే కోలుకుంటున్నారు. కేవలం 10 శాతం మందిలో మాత్రమే వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. డెల్టా వేరియంట్ పూర్తిగా తొలగిపోలేదు. డెల్టా సోకితే లక్షణాలు మూడ్రోజుల తర్వాత బయటపడతాయి. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. స్వల్ప లక్షణాలున్నవారు ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉండాలి. ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలుంటేనే ఆస్పత్రిలో చేరాలి." - శ్రీనివాస రావు, డీహెచ్
ఇంటి వద్దకే టీకా..
Corona Third Wave in Telangana : కోటికి పైగా హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామని డీహెచ్ తెలిపారు. ర్యాపిడ్‌తోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేస్తున్నామని చెప్పారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామన్నారు. సంక్రాంతితో పాటు మరికొన్ని పండుగలు రాబోతున్నందున.. ఈనెల 8 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే మూడో దశ నుంచి త్వరగా బయటపడవచ్చని పేర్కొన్నారు. 15-18 ఏళ్ల వయసు గల వారికి 10 శాతం మందికి తొలిడోసు ఇచ్చామని డీహెచ్ చెప్పారు. విద్యార్థుల ఇంటి వద్దకే వెళ్లి టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
90 శాతం ఒమిక్రాన్ కేసులే..
Corona Cases in Telangana: భవిష్యత్లో 90 శాతం కేసులు ఒమిక్రాన్వే ఉంటాయని డీహెచ్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడ్మిషన్ ప్రొటోకాల్ పాటిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని మాత్రమే చేర్చుకోవాలని ఆదేశించారు. మూడో దశలో కరోనా సోకిన వారికి కేవలం సింప్టమాటిక్ చికిత్స ఇస్తే సరిపోతుందని చెప్పారు. అనవసరంగా మొల్నుఫిరావిర్, కాక్టాయిల్ వంటి చికిత్సలు తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ప్రొటోకాల్స్ ఆధారంగా కరోనా సోకిన వారికి ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స అందించాలని.. అనవసరంగా పేదల నుంచి డబ్బు గుంజితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
వచ్చే 4 వారాలు చాలా ముఖ్యం..
Telangana Public Health Staff Leaves Cancelled: వచ్చే నాలుగు వారాలు చాలా ముఖ్యం. ఫిబ్రవరి నెలలో మళ్లీ కేసులు తగ్గే అవకాశం ఉంది. ప్రజారోగ్య సిబ్బందికి నేటి నుంచి సెలవులు రద్దు. వచ్చే 4 వారాలు ఎలాంటి సెలవులూ ఉండవు. సంక్రాంతికి కేసులు మరింత పెరిగే ప్రమాదముంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వచ్చే 4 వారాలు అన్ని కార్యక్రమాలు నియంత్రించుకోవాలి. ఆంక్షల వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా కేసులను తగ్గించవచ్చు. ప్రజలంతా వైద్యఆరోగ్య శాఖకు సహకరించి.. ఈ మహమ్మారిని మరోసారి పారదోలడానికి సాయం చేయాలి. - శ్రీనివాస రావు, ప్రజారోగ్య సంచాలకులు
- ఇదీ చదవండి : దేశంలో కరోనా విలయ తాండవం .. ఒక్కరోజే 90,928 కేసులు